అల్లూరి స్ఫూర్తితో గిరిజనాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:59 PM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ టి.నిషాంతి పిలుపు
జిల్లాలో ఘనంగా విప్లవ వీరుడి జయంతి వేడుకలు
పాడేరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి పిలుపునిచ్చారు. శనివారం అల్లూరి 129వ జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని సీతారామరాజు విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంగ్లేయులను ఎదిరించి వారిపై పోరాటం చేసేందుకు ఆదివాసీలను సంసిద్ధం చేసిన ధీరుడు అల్లూరి అని కొనియాడారు. మన జిల్లాకు అటువంటి మహనీయుని పేరు పెట్టడడం గర్వకారణమన్నారు. విద్యార్థులకు అల్లూరి జీవిత చరిత్రను తెలియజేయడం ద్వారా వారు స్ఫూర్తిగా తీసుకుని నాయకులుగా ఎదుగుతారన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. గిరిజనుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించి స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామ్యం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ రహీమ్, ఎస్‌డీసీ బి.నీలకంఠరావు, టీడీపీ నేతలు డప్పోడి వెంకటరమణ, బొర్రా విజయరాణి, బుద్ద జ్యోతికిరణ్, అల్లంగి సుబ్బలక్ష్మి, జి.వెంకటకుమారి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్‌పీ కార్యాలయంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్‌పీ వై.శృతి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 27 ఏళ్ల వయస్సులోనే సీతారామరాజు ఆంగ్లేయులతో పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో ఎన్‌డీపీఎస్ సీఐ పీపీ.నాయుడు, ఎస్‌ఐలు, హెచ్‌సీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అల్లూరి జీవితం స్ఫూరిదాయకం: కిడారి
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం స్ఫూర్తిదాయకమని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి గిరిజనులకు అండగా ఉంటూ ఆంగ్లేయులపై జరిపిన పోటారాలను గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాంగి పాండురంగస్వామి, సాగర సుబ్బారావు, జి.మురళీ, కుమార్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.