Share News

గరిష్ఠ స్థాయికి డుడుమ నీటిమట్టం

ABN , Publish Date - Jul 04 , 2026 | 10:57 PM

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది.

గరిష్ఠ స్థాయికి డుడుమ నీటిమట్టం
డుడుమ నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

బలిమెలకు నీరు విడుదల

ముంచంగిపుట్టు, జూలై 4 (ఆంధ్రజ్యోతి):ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడంతో జలాశయంలో నీటి నిల్వలు ఎన్నడూ లేని విధంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల నుంచి వర్షపు నీరు జలాశయంలోకి వచ్చి చేరుతున్నది. జలాశయంలో 2,590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కాగా శనివారం నాటికి 2,587.4 అడుగుల నీటిమట్టం నమోదైందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు ఎక్కువగా జలాశయంలోకి చేరే అవకాశం ఉందని గ్రహించిన ప్రాజెక్టు అధికారులు 7వ నంబరు గేట్‌ను ఎత్తివేసి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో గల బలిమెలకు విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయానికి ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయంలో సైతం నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరినట్టు తెలిసింది. ఇటీవల మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం కారణంగా నేటికీ విద్యుత్తు ఉత్పాదన పునరుద్ధరణ కాలేదు. దీంతో డుడుమ జలాశయంలో నీరు ఎక్కువగా ఉండడంతో దిగువ ప్రాంతానికి విడుదల చేయాల్సి వస్తోంది. రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని, దిగువ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు.

Updated Date - Jul 04 , 2026 | 10:57 PM