Share News

గరిష్ఠ స్థాయిలో డుడుమ, జోలాపుట్టు జలాశయాలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:14 PM

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాలలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది.

గరిష్ఠ స్థాయిలో డుడుమ, జోలాపుట్టు జలాశయాలు
డుడుమ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

కొనసాగుతున్న నీటి విడుదల

డొంకారాయి గేట్లు మూసివేత

ముంచంగిపుట్టు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాలలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు మత్స్యగెడ్డ పాయల్లోకి వరదనీరు ఎక్కువగా వచ్చి చేరడంతో ఈ రెండు జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో పెరిగింది. ఈ కారణంగా గత వారం రోజులుగా జలాశయాల్లో వరదనీరు విడుదల జరుగుతున్నది. జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా శుక్రవారం 2747.95 అడుగులు నీటిమట్టం నమోదైంది. స్పిల్‌వే డ్యాం నుంచి దిగువ ప్రాంతంలో గల డుడుమకు 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయంలో 2,590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 2587.3 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక్కడ నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న బలిమెలకు 18వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పాదనకు అవసరమైన నీటిని డుడుమ డ్యాం నుంచి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో మూడు జనరేటర్ల సహాయంతో 51 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతున్నది.

డొంకరాయి నీటి విడుదల నిలిపివేత

సీలేరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి నీటి విడుదలను శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి నిలిపివేసినట్టు ఏపీ జెన్‌కో అధికారి (ఏఈ) శివశంకర్‌ తెలిపారు. ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో డొంకరాయి జలాశయానికి వరద ముంపు పొంచి ఉంటుందన్న ముందస్తు చర్యల్లో భాగంగా ఈనెల 27 రాత్రి నుంచి జలాశయం నీటిమట్టం 1028 అడుగులకు తగ్గించే చర్యలు జెన్‌కో అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో 27వ తేదీన రెండు గేట్లు ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో 29వ తేదీ నుంచి నీటి విడుదలను రెండు వేల నుంచి నాలుగు వేల క్యూసెక్కులకు పెంచి నీటిమట్టం పెరగకుండా చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో రాత్రి 7 గంటలకు జలాశయం నీటిమట్టం 1030.80 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదలను నిలిపివేసినట్టు జెన్‌కో ఏఈ శివశంకర్‌ తెలిపారు.

Updated Date - Oct 30 , 2026 | 11:14 PM