డుడుమ, జోలాపుట్టు జలాశయాలు కళకళ
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:15 PM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాలు వరదనీటితో కళకళలాడుతున్నాయి.
కొనసాగుతున్న నీటి విడుదల
ముంచంగిపుట్టు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాలు వరదనీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఈ రెండు జలాశయాలు అడుగంటిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలాశయాల్లోకి వరదనీరు ఎక్కువగా వచ్చి చేరింది. దీంతో ప్రస్తుతం రెండు జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరువ అవుతున్నాయి. జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, గురువారం 2746.45 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రధాన జలాశయం ఆనుకొని స్పిల్వే డ్యామ్ నుంచి దిగువ ప్రాంతంలో గల డుడుమకు 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయంలో 2,590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,584 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక్కడ నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న బలిమెలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పాదనకు అవసరమైన నీటిని సరఫరా చేస్తున్నారు.