అడుగంటుతున్న జలాశయాలు
ABN , Publish Date - Jul 26 , 2026 | 01:02 AM
సీలేరు కాంప్లెక్సుకు నీటి గండం పొంచి ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో జలాశయాల్లో రోజురోజుకు నీటిమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో విద్యుదుత్పత్తికి గడ్డురోజులు ఏర్పడనున్నాయి. దీంతో గోదావరి డెల్టాకు నీటి విడుదలను నిలిపేశారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు సీలేరు కాంప్లెక్సు పరిధిలో నాలుగు నెలలకు సరిపోతాయని జెన్‌కో అధికారులు చెబుతున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే సీలేరు కాంప్లెక్సులో విద్యుదుత్పత్తికి ఆటంకం
భవిష్యత్తులో విద్యుత్ కేంద్రాలు మూతపడే అవకాశం
సీలేరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సుకు నీటి గండం పొంచి ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో జలాశయాల్లో రోజురోజుకు నీటిమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో విద్యుదుత్పత్తికి గడ్డురోజులు ఏర్పడనున్నాయి. దీంతో గోదావరి డెల్టాకు నీటి విడుదలను నిలిపేశారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు సీలేరు కాంప్లెక్సు పరిధిలో నాలుగు నెలలకు సరిపోతాయని జెన్‌కో అధికారులు చెబుతున్నారు.
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మాచ్‌ఖండ్, ఎగువసీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలు ఏడాది పొడవునా రాష్ర్టానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్నాయి. రబీ సీజన్‌లో గోదావరి డెల్టాకు 40 నుంచి 50 టీఎంసీల నీటిని అందిస్తున్నాయి. ప్రతి ఏటా జూలై నాటికి ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలతో బలిమెల, జోలాపుట్, డొంకరాయి జలాశయాలు నీటితో కళకళలాడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సీలేరు పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జూలై నెల పూర్తి కావస్తున్నప్పటికీ వర్షాలు కురవకపోవడంతో రోజురోజుకు జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ ఏడాది సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలకు నీటి గండం తప్పదేమోనని జెన్‌కో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో రెండో దశ నిర్మాణ పనులు నేపథ్యంలో రెండు నెలలుపాటు సీలేరు కాంప్లెక్సు పరిధిలో విద్యుదుత్పత్తిని నిలిపివేయడంతో బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటా నీరు తక్కువగా వినియోగించుకున్నారు. దీంతో 2025-2026 నీటి సంవత్సరం జూన్ 30 నాటికి ముగిసే సమయానికి బలిమెలలో ఆంధ్రా వాటా 25 టీఎంసీలు మిగిలిపోయాయి. గత ఏడాది బలిమెలలో మిగుల నీటినే ప్రస్తుతం సీలేరు కాంప్లెక్సులోని సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలు వినియోగిస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ఇటీవల గోదావరి డెల్టా ఖరీఫ్‌కు కూడా ఐదు టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తి చేయకుండా నేరుగా విడుదల చేశారు.
జలాశయాల్లో పడిపోతున్న నీటిమట్టాలు
సీలేరు కాంప్లెక్సు పరిధిలో మొదటి జలాశయం జోలాపుట్. ఇక్కడ పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా గత ఏడాది ఇదే సమయానికి ఇక్కడ 2,738.55 అడుగులు నీటిమట్టం ఉండగా, 20.5413 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 2,715.90 అడుగుల నీటిమట్టం ఉండగా 8.7055 టీఎంసీలు నిల్వలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 11.8358 టీఎంసీల నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి జలాశయం బలిమెల. ఈ జలాశయంలోని నీటి నిల్వలను ఆంధ్రా, ఒడిశా చెరిసగం వినియోగించుకుంటాయి. బలిమెల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,516 అడుగులు కాగా ఇక్కడ 127.50 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. గత ఏడాది ఇదే సమయానికి 1,462.10 అడుగుల నీటిమట్టం ఉండగా, 18.3700 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 1,455 అడుగుల నీటిమట్టం ఉండగా. ఇక్కడ 12.5000 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది కంటే 5.8700 టీఎంసీల నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా 16.50 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. గత ఏడాది ఇదే సమయానికి ఇక్కడ 1,007 అడుగుల నీటిమట్టం ఉండగా.. 6.2825 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 1,025 అడుగుల నీటిమట్టం ఉండగా, 10టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. అయితే గోదావరి డెల్టా ఖరీఫ్‌కు నీటి విడుదల నేపథ్యంలో బలిమెల నుంచి ఆంధ్రా వాటా నీటిని తీసుకోవడంతో గత ఏడాది కంటే ఇక్కడ ఎక్కువ నీటి నిల్వలు ఉన్నాయి.
వర్షపాతం తక్కువ
సీలేరు నదీ పరివాహక ప్రాంతంలో గత ఏడాది 778 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 519 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 259 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది.
సీలేరు కాంప్లెక్సులో నీటి నిల్వలు
సీలేరు కాంప్లెక్సు జలవిద్యుత్ కేంద్రాలకు బలిమెల జలాశయం జీవనాధారం, ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 23.3795 టీఎంసీలు, గుంటవాడ, డొంకరాయి రెండు జలాశయాల్లో 10.7667 టీఎంసీలతో మొత్తంగా 34.1462 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ఉన్న నీటి నిల్వలు 4 నెలలకు ఢోకా లేదు..
సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు
బలిమెల, జోలాపుట్ జలాశయాల నుంచి ఆంధ్రా వాటాగా సీలేరు కాంప్లెక్సుకు ఏడాది పొడవునా 75 నుంచి 80 టీఎంసీలు నీరు వస్తోంది. ఈ నీటిని వినియోగించి సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల్లో ఏడాది పొడవునా పీక్‌లోడ్ అవర్స్‌లో విద్యుదుత్పత్తిని చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో నాలుగు నుంచి ఐదు నెలల వరకు విద్యుదుత్పత్తికి ఢోకా ఉండదు. గోదావరి డెల్టా ఖరీఫ్‌కు జూన్ 22 నుంచి మూడు విడతలుగా జూలై 23 వరకు 4.852 టీఎంసీలు విడుదల చేశాం.