Share News

ఎండా... వాన

ABN , Publish Date - May 12 , 2026 | 12:38 AM

మన్యంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపగా, మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది.

ఎండా... వాన
పాడేరులో సోమవారం సాయంత్రం భారీ వర్షం

మన్యంలో భిన్న వాతావరణం

మధ్యాహ్నం వరకు భానుడి ప్రతాపం.. ఆ తరువాత భారీ వర్షం

పాడేరు, మే 11 (ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపగా, మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడికి అల్లాడిపోయిన జనం వర్షంతో ఊరట చెందారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం వేళ జన సంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సోమవారం కొయ్యూరులో 34.7, అరకులోయలో 32.5, ముంచంగిపుట్టులో 31.7, అనంతగిరిలో 31.2, హుకుంపేటలో 29.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పెదబయలులో..

పెదబయలు: మండలంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాగా, మధ్యాహ్నం మూడు గంటల నుంచి వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం పడింది. దీంతో వారపు సంతకు వచ్చిన వినియోగదారులు, వర్తకులు ఇబ్బంది పడ్డారు.

చింతపల్లిలో..

చింతపల్లి: మండలంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. సోమవారం ఉదయం పొగమంచు, మధ్యాహ్నం వరకు ఎండ, ఆ తరువాత వర్షం కురిసింది. వర్షానికి జనం ఊరట చెందారు. అయితే ఈ వర్షాలు ఏ స్థాయిలో పంటలకు సహకరిస్తాయనేది వేచి చూడాలి. కాగా గిరిజన ప్రాంత వాతావరణాన్ని ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండలంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మండల కేంద్రం నుంచి పెదబయలు, జోలాపుట్టు, సంగడ, కుమడ వెళ్లే ప్రధాన రహదారుల పైనుంచి పలు చోట్ల వరద నీరు ప్రవహించింది. పలు చోట్ల వాగులు, వంకలు, మత్స్యగెడ్డ పాయల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మట్టి రహదారులు బురదమయంగా మారడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు.

Updated Date - May 12 , 2026 | 12:38 AM