Share News

రైతుల ముంగిట్లో డ్రోన్‌ సేవలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:53 AM

రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని, ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్ల వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి పిలుపునిచ్చారు. జిల్లాలోని 19 మండలాల్లో 20 కిసాన్‌ డ్రోన్‌లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

రైతుల ముంగిట్లో డ్రోన్‌ సేవలు

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు చల్లేందుకు వినియోగం

యాప్‌ ద్వారా బుక్‌ చేసుకొనే వెసులుబాటు

ఎకరా విస్తీర్ణంలో పది నిమిషాల్లోనే మందు పిచికారీ

అనకాపల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని, ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్ల వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి పిలుపునిచ్చారు. జిల్లాలోని 19 మండలాల్లో 20 కిసాన్‌ డ్రోన్‌లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఐదుగురు రైతులను ఒక గ్రూపుగా ఏర్పరచి, వారిలో ఒకరిని పైలట్‌గా ఎంపిక చేసి 12 రోజుల శిక్షణ ఇచ్చామన్నారు. డ్రోన్‌ మార్ట్‌ అనే ప్రత్యేక యాప్‌ ద్వారా రైతులు క్యాబ్‌ తరహాలో డ్రోన్‌లను బుక్‌ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఊబరైజేషన్‌ ఆఫ్‌ కిసాన్‌ డ్రోన్స్‌’ (ఠఛ్ఛటజ్డ్చ్టీజీౌుఽ ౌజ జుజీట్చుఽ ఛీటౌుఽ్ఛట) అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రైతులు తమ ఫోన్‌ నంబరు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు ఉన్న లొకేషన్‌ ఆధారంగా సమీపంలో వున్న డ్రోన్‌లకు యాప్‌ చూపిస్తుందన్నారు. దీని ఆధారంగా రైతు డ్రోన్‌ను బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సర్వీస్‌ ప్రొవైడర్‌గా డ్రోన్‌ గ్రూప్‌ వారు రైతుల అభ్యర్థనను స్వీకరించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు చల్లుతారని పేర్కొన్నారు. ఎక్కువ మంది రైతులు పురుగు మందు చల్లేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.. డ్రోన్‌ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే ఎకరా విస్తీర్ణంలో ఎరువు, పురుగు మందును చల్లే అవకాశం ఉందన్నారు. డ్రోన్‌ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు అద్దె వసూలు చేస్తారని తెలిపారు.

Updated Date - Feb 06 , 2026 | 12:53 AM