మన్యంలో డ్రోన్ కలకలం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:36 AM
మన్యంలో డ్రోన్ కలకలం రేపింది. పాడేరు నుంచి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి శుక్రవారం మందులు తీసుకువెళుతున్న డ్రోన్ బ్యాటరీలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో పెదబయలు మండలం గంపరాయి పంచాయతీ బొయితిలి గ్రామ సమీపంలో కూలిపోయింది.
- పాడేరు నుంచి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి మందులు తీసుకువెళుతుండగా
సాంకేతిక సమస్యతో బొయిలితి వద్ద కూలిపోయిన వైనం
లోపాన్ని సరిచేసి తిరిగి పాడేరు పంపిన సిబ్బంది
పాడేరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మన్యంలో డ్రోన్ కలకలం రేపింది. పాడేరు నుంచి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి శుక్రవారం మందులు తీసుకువెళుతున్న డ్రోన్ బ్యాటరీలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో పెదబయలు మండలం గంపరాయి పంచాయతీ బొయితిలి గ్రామ సమీపంలో కూలిపోయింది. అయితే ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్రామానికి సమీపాన డ్రోన్ కూలడంతో పరిసర ప్రాంతాల్లోని గిరిజనులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తరువాత డ్రోన్ కూలిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అది యుద్ధానికి సంబంధించినది కాదని, మందులు తీసుకువెళుతున్నదని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. డ్రోన్ సాంకేతిక సమస్యతో అకస్మాత్తుగా కూలిన విషయాన్ని గమనించిన రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బ్యాటరీ, పవర్ సప్లైలో నెలకొన్న సాంకేతిక సమస్యను సరిచేసి, దానిని తిరిగి పాడేరు పంపించారు. అయితే అదృష్టవశాత్తూ డ్రోన్ కూలిన ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. డ్రోన్ కూడా పాడవలేదు. అయితే డ్రోన్ కూలిన ఘటన సోషల్ మీడియాలో విభిన్నమైన కథనాలతో ప్రచారం కావడంతో పలువురు ఆందోళన చెందారు.