Share News

ముసురు

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:48 AM

నగరంలో కరువు తీరా వర్షం కురిసింది.

ముసురు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు

పల్లపు ప్రాంతాలు జలమయం

సగటున 66.2 మి.మీ.వర్షపాతం నమోదు

నేడు తీరానికి చేరువగా రాక

నేడు, రేపు భారీవర్షసూచన

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

నగరంలో కరువు తీరా వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇదే అతి పెద్ద వర్షం. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల పడుతున్న ఈ వర్షాలు బుధ, గురువారాల్లోను కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నగరంలో పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గెడ్డలు, కాలువల్లో సరిగా పూడిక తీయనిచోట మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. జీవీఎంసీ అధికారులు వార్డుల్లో పర్యటించి దగ్గరుండి కాలువల్లో పూడిక తీయించకుంటే ప్రజలు రోడ్లపై నడవలేని పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. ఈ వర్షాల వల్ల నీటి కోసం ఇబ్బందిపడుతున్న ప్రజలు కాసింత ఊపిరి తీసుకున్నారు. ఎండిపోయిన బోర్లన్నీ పనిచేస్తున్నాయి. ట్యాంకర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నిత్యావసరాలకు సరిపడా నీటిని అందిస్తున్నాయి. సీతమ్మధార, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడ, రుషికొండ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కాసింత రీచార్జి అయ్యాయి.

ఆకస్మిక వరద హెచ్చరిక జారీ

మంగళవారం రాత్రికి విశాఖపట్నానికి తూర్పు దిశగా 220 కి.మీ. దూరంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయానికి తీరానికి మరింత చేరువగా రానున్నది. తీరానికి వచ్చే క్రమంలో కొన్ని గంటలపాటు సముద్రంలో స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల శ్రీకాకుళం నుంచి విజయనగరం, విజయనగరం, అనకాపల్లి జిల్లా వరకు వర్షం తీవ్రత పెరగనున్నది. తీవ్ర వాయుగుండం గమనం పరిశీలిస్తే బుధవారం రాత్రి కళింగపట్నానికి సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర వాయుగుండానికి దక్షిణ, నైరుతి భాగంలో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఆకస్మిక వరదలు వస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. విశాఖ జిల్లాలో వర్షాలు పెరగనున్నందున లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తుండడంతో అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సగటున 66.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.


అధికారులు అప్రమత్తంగా ఉండాలి

క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి

సెలవులు రద్దు

విద్యుత్‌, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడండి

అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, జేసీ విద్యాధరితో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీవర్షాల ప్రభావం ఉండే ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గేంత వరకూ ఏ విధమైన సెలవులు మంజూరు చేయబడవన్నారు. లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అవసరమైనచోట సహాయక చర్యలకు రక్షణ బృందాలు, వాహనాలు, పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, తదితర సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు, అవసరమైన సమాచారం అందించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రతించేలా కంట్రోల్‌ రూమ్‌ వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్‌తోపాటు డివిజన్‌, మండల స్థాయిల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.


కలెక్టరేట్‌, డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు

భారీవర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌, ఇతర డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. ఇవన్నీ నిరంతరం పనిచేస్తాయని, మూడు రోజులపాటు ప్రజలకు సేవలందిస్తాయని పేర్కొన్నారు.

కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891-2590100, 0891-2590102

జీవీఎంసీ సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ 180042500009

వాట్సాప్‌ నంబర్‌ 9014218870

విశాఖ ఆర్డీవో కార్యాలయం 0891-2562977

భీమిలి ఆర్డీవో కార్యాలయం 9014093139

మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు

కేంద్రం మి.మీ.

చంద్రంపాలెం ఉన్నత పాఠశాల 71.5

గంభీరం 67.25

పద్మనాభ నగర్‌ 65.75

కాపులుప్పాడ 64.50

మధురవాడ తులసినగర్‌ పార్కు 60.45


నేడు విద్యా సంస్థలకు సెలవు

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశాల మేరకు బుధవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాల వల్ల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందిపడే అవకాశం ఉండడంతో ఈ మేరకు కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించాలన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:48 AM