Share News

ముసురు

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:20 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. అత్యధిక మండలాల్లో దఫదఫాలుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చీకటి పడిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. వాయుగుండం మంగళవారం రాత్రి తీవ్రవాయుగుండంగా బలపడడం, తీరానికి చేరువ అవుతుండడంతో జిల్లాలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ముసురు
వర్షంతో జలమయమైన చోడవరం ప్రధాన రహదారి

తీవ్ర వాయుగుండం ప్రభావంతో జోరు వాన

లోతట్టు ప్రాంతాలు జలమయం

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

కలెక్టరేట్‌తోపాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు

విపత్కర పరిస్థితులను అధిగమించడానికి సహాయక బృందాలు సిద్ధం

మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

పది గంటల్లో 40.6 మి.మీ. వర్షం.... ఖరీఫ్‌పై చిరుగురించిన ఆశలు

--------

కంట్రోల్‌ రూమ్‌ల టోల్‌ఫ్రీ నంబర్లు

కలెక్టర్‌ కార్యాలయం : 08924-222888, 08924-226599, 08924-225999

అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం: 9014578858

నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం: 08932 224420

అడ్డరోడ్డు జంక్షన్‌ ఆర్డీవో కార్యాలయం: 08931-293606

-----

అనకాపల్లి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. అత్యధిక మండలాల్లో దఫదఫాలుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చీకటి పడిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. వాయుగుండం మంగళవారం రాత్రి తీవ్రవాయుగుండంగా బలపడడం, తీరానికి చేరువ అవుతుండడంతో జిల్లాలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల వల్ల ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక బృందాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్‌, అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌ తరచూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర మండలస్థాయి అధికారులు, స్వర్ణ గ్రామ/ వార్డు కార్యాలయాల సిబ్బంది.. తమ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల అవసరాల కోసంం నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే.. తాగునీరు సరఫరాకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా సెల్‌ఫోన్‌ టవర్ల వద్ద జనరేటర్లను సిద్ధంగా ఉంచారు.

సహాయక బృందాలు సిద్ధం

భారీ వర్షాల వల్ల లోతట్టు నివాస ప్రాంతాలు ముంపునకు గురైతే.. బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. ముంపు ప్రాంతాల వారిని అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించి, తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు విద్యా సంస్థల భవనాలను సిద్ధం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో చెరువుల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జలవనరుల శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం వుండడంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను వెంటనే వెనక్కి రప్పించేందుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

ఖరీఫ్‌పై చిరుగురించిన ఆశలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. పొలాల్లో నీరు చేరింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసిన వరినాట్లుకు ఈ వర్షం జీవం పోసిందని అంటున్నారు. ఇంతవరకు నాట్లు వేయని రైతులు.. పొలాలను దమ్ముచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పొలాల్లో వున్న చెరకు, అపరాలు, చిరుధాన్యాలు, కూరగాయ పంటలకు వర్షం ఎంతో మేలు చేస్తుందని సంతోషంగా చెబుతున్నారు. ముసురు వాతావరణం కారణంగా సాధారణ జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి పట్టణంలో గుండాల జంక్షన్‌, రైల్వే అండర్‌ బ్రిడ్జి, తుమ్మపాల వెళ్లే ప్రధాన రోడ్లుపై వర్షపు నీరు చేరింది. కొండకొప్పాక జాతీయ రహదారిపై నుంచి ఏలేరు కాలువ నీరు పొంగి ప్రవహించింది.

40.6 మి.మీ. వర్షం

జిల్లాలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 40.6 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సబ్బవరం మండలంలో 64.6 మి.మీ. వర్షం కురవగా అత్యల్పంగా పాయకరావుపేట మండలంలో 17.6 మి.మీ. వర్షం కురిసింది. పరవాడలో 59.6 మి.మీ., కె.కోటపాడులో 57.2, కశింకోటలో 57.2, మునగపాకలో 55.2, అనకాపల్లిలో 54.4, చోడవరంలో 52.6, మాడుగులలో 51.8, దేవరాపల్లిలో 48.4, అచ్యుతాపురంలో 42.2, చీడికాడలో 43.2, బుచ్చెయ్యపేటలో 42.2, రాంబిల్లిలో 39.8, నర్సీపట్నంలో 37.4, రావికమతంలో 37.8, ఎలమంచిలిలో 33.2, మాకవరపాలెంలో 32.8, కోటవురట్లలో 25.6, నక్కపల్లిలో 21.2, రోలుగుంటలో 26.2, ఎస్‌.రాయవరంలో 26.4, గొలుగొండలో 28.6 నాతవరంలో 18.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఆరు గంటల తరువాత వర్షతీవ్రత పెరిగింది.

నేడు విద్యా సంస్థలకు సెలవు

అనకాపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - Sep 23 , 2026 | 12:20 AM