Share News

గిరి రైతులకు డ్రిప్‌, స్పింక్లర్లు ఉచితం

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:30 PM

వ్యవసాయ పరంగా గిరిజన రైతులకు మరింతగా ప్రోత్సహించేందుకు డ్రిప్‌, స్పింక్లర్లు ఉచితం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గిరి రైతులకు డ్రిప్‌, స్పింక్లర్లు ఉచితం

రాష్ట్ర క్యాబినెట్‌లో నిర్ణయం

అన్నదాతల ఆనందం

పాడేరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):వ్యవసాయ పరంగా గిరిజన రైతులకు మరింతగా ప్రోత్సహించేందుకు డ్రిప్‌, స్పింక్లర్లు ఉచితం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన 45వ క్యాబినెట్‌ సమావేశంలో గిరిజన రైతులకు డ్రిప్‌, స్పింక్లర్లకు శతశాతం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు కేవలం 50 శాతం మాత్రమే వాటికి రాయితీ కల్పిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ధాత్రి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌లో ఉన్న జిల్లాల్లోని గిరిజన రైతులకు కేంద్రం 54 శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నది. దీంతో ఇకపై గిరిజన రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌లో శత శాతం, స్పింక్లర్‌ ఇరిగేషన్‌లో 90 శాతం రాయితీ (లబ్ధిదారుని వాటా 10 శాతం)ని కల్పించాలని నిర్ణయించారు.

గిరిజన రైతులకు ఎంతో మేలు

జిల్లాలోని అన్ని మండలాల్లోనూ గిరిజనులు కూరగాయలు, పువ్వులు, ప్రత్యేక పంటలైన స్ట్రాబెరీ, అవకాడో, డ్రాగన్‌ఫ్రూట్‌, తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఈక్రమంలో డ్రిప్‌, స్పింక్లర్లను గిరిజన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ, ఉచితంగా అందడంతో వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా చింతపల్లి, జీకేవీధి, అరకులోయ, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు మండలాల్లో గిరిజనులు అధిక విస్తీర్ణంలో కూరగాయలు, ప్రత్యేక పంటలను సాగు చేస్తున్నారు. వీటి రాయితీతో పంట సాగు విస్తీర్ణాన్ని పెంచుకునేందుకు చక్కని అవకాశంగా రైతులు భావిస్తున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 10:30 PM