తాగునీటికి కటకట
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:47 AM
నగరంలో నీటి కోసం కష్టాలు తారస్థాయికి చేరాయి.
వర్షాభావంతో రిజర్వాయర్లు వెలవెల
నగరానికి తగ్గిన సరఫరా
దీంతో కొళాయిల ద్వారా నీరు ఇచ్చే సమయం గణనీయంగా తగ్గింపు
కొన్ని ప్రాంతాల్లో రోజు తప్పించి రోజు సరఫరా
సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరఫరా
గంటల తరబడి మహిళల ఎదురుచూపులు
బిందెలతో చాంతాడంత క్యూలైన్లు
ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వట్టిపోయిన బోర్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో నీటి కోసం కష్టాలు తారస్థాయికి చేరాయి. విస్తారంగా వర్షాలు కురవాల్సిన సీజన్‌లో వేసవిని తలపించే వాతావరణం నెలకొనడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. మరోవైపు రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవడంతో నగరానికి సరఫరా తగ్గింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో కొళాయిల ద్వారా రోజు విడిచి రోజు నీరు ఇస్తున్నారు. సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలకు జీవీఎంసీ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నప్పటికీ అరకొరగానే అందుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నగర పరిధిలో నివసిస్తున్న 25 లక్షల జనాభా కోసం జీవీఎంసీ ప్రతిరోజూ 90 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) నీటిని సరఫరా చేస్తుంటుంది. ఇందుకోసం ఏలేరు రిజర్వాయర్ నుంచి 41.5 ఎంజీడీ, రైవాడ నుంచి 13.28 ఎంజీడీ, తాటిపూడి రిజర్వాయర్ నుంచి పది ఎంజీడీ, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ నుంచి 8.5 ఎంజీడీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లతోపాటు గోస్తనీ, గోదావరి నదుల్లో తవ్విన ఫిల్టర్ పాయింట్ల నుంచి మిగిలిన నీటిని తీసుకుంటోంది. ఇదే లెక్కన చాలాకాలంగా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేసవి కారణంగా సరఫరాలో సమస్య మొదలైంది. సాధారణంగా రిజర్వాయర్లలో మే, జూన్ వరకు నిల్వలు తక్కువగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి కాబట్టి సమస్య వచ్చేది కాదు. అయితే ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా వర్షాభావ పరిస్థితే కొనసాగుతోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఏలేరు, రైవాడ, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి సాగుకు నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి. ఒకవైపు వర్షాలు కురవకపోవడం, మరోవైపు వ్యవసాయ అవసరాలకు నీటిని విడుదల చేస్తుండడతో రిజర్వాయర్లలో నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఆ ప్రభావం నగరానికి తాగునీటి సరఫరాపై పడుతోంది. ఏలేరు రిజర్వాయర్ కనిష్ఠ స్థాయి నీటిమట్టం 71.5 మీటర్లు కాగా ప్రస్తుతం 75.28 మీటర్లు ఉంది. అలాగే రైవాడ రిజర్వాయర్ కనిష్ఠ నీటిమట్టం 99 మీటర్లుకాగా ప్రస్తుతం 106.97 మీటర్లు ఉంది. తాటిపూడి రిజర్వాయర్ కనిష్ఠ నీటిమట్టం 251 అడుగులు కాగా ప్రస్తుతం 287.5 అడుగులు, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ కనిష్ఠ స్థాయి నీటిమట్టం 44 అడుగులు కాగా ప్రస్తుతం 50.1 అడుగుల మేర నీరు ఉంది. కొన్నాళ్ల కిందటివరకు ప్రతిరోజూ 90 ఎంజీడీల నీటిని తాగునీటి కోసం నగరానికి చేరితే...ఇప్పుడు ఏకంగా 65 ఎంజీడీలకు తగ్గిపోయినట్టు జీవీఎంసీ అధికారవర్గాలు చెబుతున్నారు.
తాగునీటి కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షణ
ఇప్పటికే బోర్లు ఎండిపోవడంతో ప్రజలంతా కొళాయిల వద్ద, ట్యాంకర్లతో జీవీఎంసీ సరఫరా చేసే నీటి కోసం గంటల తరబడి వీధుల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుబాటులో ఉన్న నీటినే అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎత్తులో ఉన్న ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలకు చేరడం లేదు. ఆరిలోవ, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడతోపాటు నగర నడిబొడ్డున ఉన్న శివాజీపాలెం, ఆరిలోవ, కేఆర్‌ఎం కాలనీ, ఫేకర్ లేఅవుట్, అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్ వంటి ప్రాంతాల్లో కొళాయిల ద్వారా నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా చేసే సమయం తగ్గించగా, ఆరిలోవ, శివశక్తి నగర్, కొమ్మాది, మారికవలస, వేపగుంటల్లో కొండవాలు ప్రాంతాల వాసులకు రోజువిడిచి రోజు సరఫరా జరుగుతోంది. జీవీఎంసీ అధికారులు ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా చేయడం ప్రారంభించారు. అయితే అపార్టుమెంట్‌లలో బోర్లు ఎండిపోవడంతో వారు ప్రైవేటు ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుని రోజువారీ అవసరాలకు వాడుకుంటున్నారు. తాగునీటి కోసం వారు కూడా జీవీఎంసీ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో ట్యాంకర్లతో వచ్చే నీటికోసం పోటీ మరింతగా పెరుగుతోంది. దీంతో ప్రజలు బిందెలతో రోడ్డుపై క్యూ కడుతున్నారు.
రిజర్వాయర్లలో నీటి మట్టాలు
రిజర్వాయర్ గరిష్ఠ కనిష్ఠం ప్రస్తుతం
ఏలేరు 86.56 మీటర్లు 71.5 మీటర్లు 75.28 మీటర్లు
రైవాడ 114 మీటర్లు 99 మీటర్లు 106.97 మీటర్లు
మేహద్రిగెడ్డ 61 అడుగులు 44 అడుగులు 50.1 అడుగులు
తాటిపూడి 297 అడుగులు 251 అడుగులు 287.5 అడుగులు
ముడసర్లోవ 169 అడుగులు 152 అడుగులు 155.04 అడుగులు
గంభీరం 126 అడుగులు 117 అడుగులు 120.09 అడుగులు
-------------------------------------------