Share News

తాగునీటికి కటకట

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:24 PM

మండలంలోని గూడెంకొత్తవీధి పంచాయతీ వీరవరం గ్రామంలో ఆదివాసీలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.

తాగునీటికి కటకట
ఊటగెడ్డ వద్ద నీళ్లు పట్టుకుంటున్న వీరవరం మహిళలు

అల్లాడిపోతున్న ఆదివాసీలు

మంచినీటి పథకాలు అందుబాటులో లేక అవస్థలు

ఊటగెడ్డ నీరే ఆధారం

గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గూడెంకొత్తవీధి పంచాయతీ వీరవరం గ్రామంలో ఆదివాసీలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. గ్రామంలో తాగునీటి పథకాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆదివాసీ మహిళలు గ్రామ శివారులో ఉన్న ఊటగెడ్డ నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. తాగేందుకు ఊటగెడ్డ నీళ్లను వినియోగించడం వల్ల తరచూ వ్యాధులకు గురవుతున్నారు.

వీరవరం గ్రామం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దులో ఉంది. గ్రామంలో 35 మంది ఆదిమజాతి ఆదివాసీలు(పీవీటీజీ) సుమారు 60 ఏళ్లుగా వీరవరం గ్రామంలో జీవిస్తున్నారు. ఆదివాసీలందరూ పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో రెండు వీధులున్నాయి. రెండు వీధుల గిరిజనులు తాగేందుకు ఎటువంటి రక్షిత మంచినీటి పథకం అందుబాటులో లేదు. ఒక వీధి గిరిజనులకు నాలుగేళ్ల క్రితం గ్రావిటీ మంచినీటి పథకం నిర్మించినప్పటికి ఆరు నెలలకే మూలకు చేరింది. గత వైసీపీ పాలకులు, అధికారులు గ్రావిటీ పథకం నిర్వహణ, మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల పూర్తిగా పాడైపోయింది. ప్రస్తుతం రెండు వీధుల గిరిజనులు గ్రామ శివారులో ఉన్న ఊటగెడ్డ నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. ఈ ఊటగెడ్డ గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊటగెడ్డకు పొలాల గట్లపై నడిచి వెళ్లాలి. గ్రామ శివారులో ఊటగెడ్డ ఉండడం, పొలాల గట్ల పైనుంచి నడిచి వెళ్లాల్సి రావడంతో మహిళలు ఒంటరిగా వెళ్లలేకపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గుంపులుగా మహిళలు ఊటగెడ్డకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వర్షాకాలం ఈ ఊటగెడ్డ కలుషితమైపోతుంది. వేసవిలో నీటి నిల్వలు తగ్గిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా గ్రామానికి చెందిన గిరిజనులు ఊటగెడ్డ నీళ్లను తాగేందుకు వినియోగించడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అన్ని సీజన్లలో జలుబు, దగ్గు, జ్వరాలు, అతిసార, చర్మవ్యాధులకు గురవుతున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:24 PM