Share News

లంబసింగిలో తాగునీటి కష్టాలు

ABN , Publish Date - May 19 , 2026 | 12:14 AM

పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన లంబసింగిలో ఆదివాసీలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో రక్షిత మంచినీటి పథకం పైపులైన్లు దెబ్బతిన్నాయి.

లంబసింగిలో తాగునీటి కష్టాలు
నిరుపయోగంగా వున్న లంబసింగిలోని మంచినీటి పథకం పంపుసెట్‌

జాతీయ రహదారి నిర్మాణంలో దెబ్బతిన్న పైపులైన్లు

మూడు నెలలుగా అవస్థలు

పట్టించుకోని పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎన్‌హెచ్‌ అధికారులు

చింతపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన లంబసింగిలో ఆదివాసీలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో రక్షిత మంచినీటి పథకం పైపులైన్లు దెబ్బతిన్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ, జాతీయ రహదారుల అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో నీళ్ల కోసం మూడు నెలలుగా మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

లంబసింగిలో సుమారు 250 కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామానికి లంబసింగి జంక్షన్‌, సంతబయలు వద్ద ఉన్న మంచినీటి పథకాల ద్వారా గతంలో నీటి సరఫరా జరిగేది. జాతీయ రహదారి నిర్మాణంలో లంబసింగి జంక్షన్‌ నుంచి లంబసింగి గ్రామానికి వచ్చే పైపులైన్లు, సంతబయలులో ఉన్న నీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగే పైపులైన్లు పలుచోట్ల దెబ్బతిన్నాయి. అలాగే సంత బయలు వద్దనున్న నీటి పథకం బోర్‌వెల్‌, మోటారు పనిచేయడం లేదు. దీంతో గ్రామస్థులు జాతీయ రహదారులు, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆ శాఖల అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం చెరువులవేనం నుంచి లంబసింగికి ఏర్పాటు చేసిన గ్రావిటీ పథకం ద్వారా కొంత మేరకు నీటి సరఫరా జరుగుతున్నది. అయితే ఈ గ్రావిటీ పథకం నీరు పంచాయతీ కేంద్రం ప్రజలందరికి అందడంలేదు. గ్రామంలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తిగత మంచినీటి బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో స్థానిక గిరిజనులు వ్యక్తిగత బోర్లు ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటూ గత మూడు నెలలుగా నెట్టుకొస్తున్నారు. మంచినీటి సమస్యపై ఇప్పటికే మండల పరిషత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులకు అర్జీలు అందజేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో స్పందించి లంబసింగిలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - May 19 , 2026 | 12:14 AM