Share News

1000 కోట్లతో తాగునీటి ప్రణాళిక

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:36 AM

నీటికష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ నగరానికి సాంత్వన కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

1000 కోట్లతో  తాగునీటి ప్రణాళిక

గోదావరి నుంచి నగరానికి తాగునీరు

ప్రతి వ్యక్తికీ రోజుకి 135 లీటర్లు అందించడమే లక్ష్యం

మురుగునీటి శుద్ధికి రూ.1,500 కోట్లతో ఎస్‌టీపీల నిర్మాణం

శుద్ధిచేసిన నీటిని పరిశ్రమల అవసరాలకు సరఫరా

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పురపాలకశాఖ మంత్రి నారాయణ ఆదేశం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నీటికష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ నగరానికి సాంత్వన కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను నగరానికి తరలించడంతో పాటు నగరంలో నీటిసరఫరాను మరింత మెరుగుపరిచేందుకు రూ.వెయ్యికోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. మురుగునీటిని శుద్ధిచేయడం ద్వారా పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు మరో రూ.1,500 కోట్లతో ఎస్‌టీపీల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోందని పురపాలకశాఖమంత్రి పి.నారాయణ ప్రకటించడంతో నగరానికి భవిష్యత్తులో తాగునీటి కష్టాలు ఉండవనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

జీవీఎంసీ పరిధిలో ప్రస్తుత జనాభా 24 లక్షలు. వచ్చే 14 ఏళ్లలో 40 లక్షలకు చేరుతుందని అంచనా. సెంట్రల్‌ పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ ఆర్గనైజేషన్‌ ప్రమాణాల ప్రకారం ఒక వ్యక్తికి తాగడం, వంట,స్నానం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇతర అవసరాలకు ప్రతిరోజూ 135 లీటర్ల నీటిని కచ్చితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనిప్రకారం ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 24 లక్షల మంది జనాభా ఉన్నందున నగరమంతటికీ ప్రతిరోజూ 320 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే నగరానికి తాగునీటిని సరఫరా చేసే రెండు చిన్నపాటి రిజర్వాయర్లు మాత్రమే ఉండడంతో ఏలేశ్వరం, తాటిపూడి, రైవాడ రిజర్వాయర్లతోపాటు గోదావరి నదిలో బోర్ల ద్వారా తోడిన నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. అన్ని రిజర్వాయర్ల నుంచి రోజుకి 180 ఎంఎల్‌డీ మించి నీటిని తరలించే అవకాశం లేకుండా పోతోంది. దీంతోపాటు పరిశ్రమలకు మరింత నీరు అవసరం కావడంతో నగరంలో తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో వేసవి వస్తే నీటికష్టాలు ఎదురవుతున్నాయి.

ఈ ఏడాది మరీ ఘోరం

ఈ ఏడాది వేసవి ముగిసిన తర్వాత కూడా వర్షాలు కురవకపోడంతో వేసవిని మించిన తాగునీటి కష్టాలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఈ కష్టాలు రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో డేటా సెంటర్లు నగరానికి పోటెత్తుతుండడంతో భవిష్యత్తులో నీటికష్టాలు మరింతగా పెరిగిపోతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది.

రూ.వెయ్యికోట్లతో ప్రణాళిక

నగరంలో ఇప్పటికే తాగునీటి సమస్య తలెత్తడంతో భవిష్యత్తులో మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్లతో నగరానికి తాగునీటి ప్రణాళిక సిద్ధం చేసినట్టు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ఇటీవల ప్రకటించడం కొంత ఊరట కలిగిస్తోంది. పోలవరం ఎడమకాలువ ద్వారా గోదావరి నీటిని కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (కేబీఆర్‌)కు తీసుకువస్తారు. అక్కడి నుంచి పైప్‌లైన్‌ ద్వారా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను నింపుతారు. అక్కడి నుంచి ముడసర్లోవలో కొత్తగా నిర్మించే ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌కు పంపిస్తారు. ఆ తరువాత పైప్‌లైన్‌ ద్వారా మధురవాడ పరిసర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే రూ.570 కోట్లతో మధురవాడ ప్రాంతంలో తాగునీటిసరఫరా నెట్‌వర్క్‌కు టెండర్‌ పిలవగా,మరో రూ.110 కోట్లతో స్కాడా ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించనున్నారు. ముడసర్లోవ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌, పైప్‌లైన్‌ నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని జీవీఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ఏలేరు నుంచి నగరానికి వస్తున్న నీటిలో కొంత పరిశ్రమలకు కేటాయిస్తుండగా, ఇకపై నగరంలో మురుగునీటిని శుద్ధిచేసి ఆ నీటిని పరిశ్రమల అవసరాలకు ఇవ్వడం ద్వారా ఏలేరు నీటిని నగరవాసుల తాగునీటి అవసరాలకు వాడుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అలాచేయగలిగితే ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్లు నీటిని సరఫరా చేయాలన్న లక్ష్యం నెరవేతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:36 AM