తాగునీరు కలుషితం
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:29 AM
స్థానిక మేజర్ పంచాయతీ ప్రజలను కలుషిత నీటి సమస్య వెంటాడుతున్నది.
చోడవరంలో కొళాయిల నుంచి బురద నీరు
ఫిల్టర్ చేయకుండా సరఫరా చేస్తున్న పంచాయతీ అధికారులు
రోగాలు ప్రబలుతాయని ప్రజల ఆందోళన
చోడవరం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
స్థానిక మేజర్ పంచాయతీ ప్రజలను కలుషిత నీటి సమస్య వెంటాడుతున్నది. రక్షిత మంచినీటి పథకం నుంచి కొళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీరు కలుషితం అవుతుండడంతో ఏం చేయాలో ప్రజలకు పాలుపోవడం లేదు. పక్షం రోజుల క్రితం పెదబజారు, చినబజారు ప్రాంతాల్లో కొళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా కాగా, వారం రోజుల క్రితం బానయ్యకోనేరు, పూర్ణా ఽథియేటర్ పరిసర ప్రాంతాల్లో మురుగురు వచ్చింది. గత మూడు రోజులుగా వ్యాపారవీధి, నౌడువీధి, ప్రేమసమాజం ప్రాంతాల్లో కొళాయిల నుంచి బురద నీరు సరఫరా అవుతున్నది. అయినప్పటికీ పంచాయతీ అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అప్పుడప్పుడు ఈ పరిస్థితి వుండేదని, ఇప్పుడే వేసవిలో కూడా బురద రంగులో నీరు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో 20 వార్డులు వుండగా రోజూ రెండు, మూడు వార్డుల్లో సరఫరా అయ్యే తాగునీరు ఇదే విధంగా ఉంటున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోడవరం వాసులకు తాగునీటి కోసం మండలంలోని జన్నవరం నుంచి ఇక్కడకు ప్రత్యేకంగా పైపులైన్ ఏర్పాటు చేశారు. అయితే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వున్న ట్యాంకులకు శుద్ధి చేయకుండా నీటి పంపింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే కొళాయిల నుంచి తరచూ బురద నీరు వస్తున్నదని అంటున్నారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తాము నీటి కలుషిత సంబంధిత వ్యాధులబారిన పడుతున్నామని వాపోతున్నారు. కలుషిత తాగునీటి సరఫరాపై స్థానికులు ఆందోళన చేసినప్పుడు లేదా పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసి, కోరినేషన్ చేస్తున్నారు. అంతేతప్ప నీటిని మాత్రం ఫిల్టర్ చేయడం లేదు. చోడవరం పట్టణవాసులకు సరఫరా చేసే ముందు తాగునీటిని శుభ్రపరచడానికి ఫిల్టర్ బెడ్ నిర్మించలేదని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా కొళాయిల ద్వారా వచ్చే కలుషిత నీటిని తాగి రోగాలబారిన పడుతున్నామని అంటున్నారు. దీంతో కొంతమంది వాటర్ క్యాన్లను కొనుగోలు చేసుకుంటున్నారు. ఇంటి పన్ను, నీటి పన్నును ముక్కుపిండి వసూలు చేస్తున్న పంచాయతీ అధికారులు, కొళాయిల ద్వారా రక్షిత తాగునీటిని ఎందుకు సరఫరా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.