Share News

పేదల కాలనీలకు తాగునీరు

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:48 AM

మునిసిపాలిటీలో సొంత ఇళ్లు లేని పేదల కోసం బలిఘట్టం, పెదబొడ్డేపల్లి, గురందొరపాలెంలో నిర్మించిన ఇళ్ల కాలనీలకు తాగునీటి సరఫరా పథకాల నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం రూ.3.06 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3.06 కోట్లు, మునిసిపాలిటీ రూ.93 లక్షల చొప్పున మొత్తం రూ.7.05 కోట్లతో వివిధ రకాల పనులు జరుగుతున్నాయి. 2028 జనవరినాటికి పనులు పూర్తి చేసి కాలనీలకు నీటి సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు.

పేదల కాలనీలకు తాగునీరు
బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద సంపు నిర్మాణం

నర్సీపట్నంలో రూ.7.05 కోట్లతో సమగ్ర మంచి నీటి పథకం

మూడు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు

ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం 14.26 కిలోమీటర్ల మేర పైపులైన్‌

2028 జనవరినాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యం

నర్సీపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో సొంత ఇళ్లు లేని పేదల కోసం బలిఘట్టం, పెదబొడ్డేపల్లి, గురందొరపాలెంలో నిర్మించిన ఇళ్ల కాలనీలకు తాగునీటి సరఫరా పథకాల నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం రూ.3.06 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3.06 కోట్లు, మునిసిపాలిటీ రూ.93 లక్షల చొప్పున మొత్తం రూ.7.05 కోట్లతో వివిధ రకాల పనులు జరుగుతున్నాయి. 2028 జనవరినాటికి పనులు పూర్తి చేసి కాలనీలకు నీటి సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు.

నర్సీపట్నం మునిసిపాలిటీలో సొంత ఇళ్లు లేని పేదలకు గత ప్రభుత్వం బలిఘట్టం, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం మండలం గురందొరపాలెంలో మొత్తం తొమ్మిది లేఅవుట్లు వేసి ఒక్కొక్కరికి సెంటు చొప్పున స్థలాలు కేటాయించింది. తరువాత ఇళ్లు మంజూరు చేసింది. కానీ ఆయా కాలనీలకు మౌలిక సదుపాయాలైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్తు వంటివి కల్పించలేదు. దీంతో ఆయా కాలనీల్లో చాలా మంది ఇళ్లు నిర్మించుకోలేదు. ఇళ్లు నిర్మించుకున్న వారు సదుపాయాలు.. ముఖ్యంగా తాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారులు ఈ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకురావడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. అమృత్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా తొమ్మిది కాలనీలకు సమగ్ర మంచి నీటి సరఫరా పథకాలను మంజూరు చేయించారు ఇందుకోసం మొత్తం రూ.7.05 కోట్లు కేటాయించగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.3.06 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3.06 కోట్లు, మునిసిపాలిటీ రూ.93 లక్షలు భరిస్తున్నాయి. గురందొరపాలెం నాలుగు, బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద ఐదు, పెదబొడ్డేపల్లిలో ఒకటి చొప్పు బోర్లు తవ్వారు. మూడుచోట్ల ఎలివేటెడ్‌ లెవెల్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌ (ఈఎల్‌ఎస్‌ఆర్‌) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటి సామర్థ్యం 11.9 లక్షల లీటర్లు. ఆయా కాలనీల్లో ఇళ్లకు తాగునీటి సరఫరా కోసం 14.26 కిలో మీటర్లు పైప్‌లైన్‌ వేస్తారు. బలిఘట్టం ఉత్తర వాహిని పాకలపాటి గురుదేవుల ఆశ్రమం వద్ద 300 కిలో లీటర్ల సంపు నిర్మిస్తున్నారు. మొత్తం పనులు 2028 జనవరి నాటికి పూర్తి చేసి ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తారు.

Updated Date - Aug 24 , 2026 | 12:48 AM