Share News

ఎండిన చెరువులు

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:41 PM

మండలంలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది.

ఎండిన చెరువులు
ఎండిపోయిన గొల్లపాలెం రాయపురాజ్‌ చెరువు

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదు

తడి లేక ఎండిపోతున్న వరి నారుమళ్లు, గంటి చేలు

వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

సబ్బవరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. గత కొన్ని రోజులుగా మేఘాలు ఊరిస్తూ ఉస్సూరుమనిపిస్తున్నాయి తప్పా.. చుక్క చినుకు నేలకు జారడం లేదు. దీని ఫలితంగా కళకళలాడాల్సిన సాగునీటి చెరువులు చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయి.

ఈ ఏడాది గంటి పంట కూడా దాదాపుగా దెబ్బతిన్న వాతావరణం కనిపిస్తోంది. మే, జూన్‌ నెలల్లో కురిసిన వర్షాలకు రైతులు గంటి నాట్లు వేశారు. వేసిన వారం పది రోజులకే వరుణ దేవుడు ముఖం చాటేయడంతో ప్రస్తుతం గంటి చేలు కూడా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. చాలా గ్రామాల్లో భూమిలో పదును లేక చేనులో ఎదుగుదల లేకుండా పోయింది. దీంతో రైతులు కూడా ఆశలు వదులుకున్నారు. సబ్బవరం, బొండావానిపాలెం, గొటివాడ, అమృతపురం, అంతకాపల్లి, మొగలిపురం, అసకపల్లి, గుల్లేపల్లి, గొల్లలపాలెం, ఆరిపాక, టెక్కలిపాలెం, వంగలి, తదితర గ్రామాల్లో రైతులు వరి నారు పోసేందుకు దుక్కులు చేసి పొలాలు సిద్ధం చేశారు. వర్షాలు పడితే నాట్లు వేయవచ్చన్న ఉద్దేశంతో చాలా గ్రామాల్లో దమ్ము చేసి, గొప్పులు తవ్వి వరి నారు పోసేశారు. ఎంతకీ వర్షం పడకపోవడంతో నారు మళ్లు నెర్రలు ఇస్తున్నాయి. భూమిలో తడి లేక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయమే జీవనాధారం

సబ్బవరం ప్రజలకు వరి సాగే ప్రధాన ఆదాయ వనరు. ఎక్కువ మంది రైతులు వరి, పాడి, ఉద్యాన పంటలు సాగు చేసుకొని జీవనోపాధి పొందుతారు. ఎటువంటి నీటి ఆధారం లేని రైతులు ఇక్కడ ఉన్నారు. మండలంలో సాధారణ వరి విస్తీర్ణం 3,400 ఎకరాలకు గాను సుమారు 4,600 మంది రైతులు సాగు చేస్తున్నారు. కాగా గతేడాది మే, జూన్‌, జూలై నెలల సాధారణ వర్షపాతం 380 ఎంఎం కాగా, 425 ఎంఎం వర్షపాతం(45 ఎంఎం అధికం) నమోదైంది. అదే ఈ ఏడాది మూడు నెలల వర్షపాతం 380 ఎంఎం కాగా, కేవలం 165 ఎంఎం వర్షపాతం మాత్రమే నమోదైంది. సగానికిపైగా(215 ఎంఎం)లోటు వర్షపాతం నమోదైంది.

తేలికపాటి పంటలు వేసుకోవాలి

తేలికపాటి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ తరువాత వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. జిల్లాలో సెప్టెంబరు 15 తరువాత కూడా వరినాట్లు వేసిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. రైతులు సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ వెద పద్ధతిలో వరి వేసుకుంటే మేలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:41 PM