అడుగంటిన మేహాద్రిగెడ్డ
ABN , Publish Date - Jul 31 , 2026 | 01:14 AM
నగరానికి నీరు సరఫరా చేసే మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నిల్వలు అడుగంటుతున్నాయి.
రిజర్వాయర్‌లో 49.5 అడుగులకు చేరిన నీరు
మరో నాలుగు ఐదు అడుగులు తగ్గితే నీటి సరఫరా బంద్
పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో గడ్డు పరిస్థితులు
విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):
నగరానికి నీరు సరఫరా చేసే మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నిల్వలు అడుగంటుతున్నాయి. రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం 61 అడుగులుకాగా నిల్వ సామర్థ్యం 1.17 టీఎంసీలు. గత ఏడాది జూలై 30వ తేదీన నీటి మట్టం 49.6 అడుగులు ఉండగా, ఈ ఏడాది 49.5 అడుగులు (0.2 టీఎంసీలు) ఉంది. డ్యామ్ గ్రౌండ్ లెవెల్ 44 అడుగులు కాగా గేటు లెవెల్ 48.5 అడుగులు. ప్రతిరోజు జీవీఎంసీలో అవసరాలకు రిజర్వాయర్ నుంచి ఎనిమిది ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు. నీటి నిల్వ 44 అడుగులకు పడిపోతే నీటి సరఫరా నిలిచిపోతుంది.
రుతుపవనాల సీజన్‌లో ఇంతవరకూ సరైన వర్షం కురవకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. వర్షాభావం ఇలాగే కొనసాగితే నెల రోజుల తరువాత నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. 1977లో రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకూ...రెండు పర్యాయాలు నీటి నిల్వ 44 అడుగుల కంటే తక్కువకు పడిపోవడంతో జీవీఎంసీ అధికారులు పైపులు పెట్టి తోడారని జల వనరుల అధికారులు గుర్తుచేస్తున్నారు. ఒక్కొక్కసారి రైవాడ రిజర్వాయర్, ఏలేరు కాల్వ నుంచి మేహాద్రిగెడ్డకు నీటిని మళ్లించి, ఇక్కడ నుంచి నగరానికి సరఫరా చేస్తుంటారు. వచ్చే నెలలో నగరానికి పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈలోగా వర్షాలు కురిస్తే రిజర్వాయర్‌లోకి నీరు చేరుతుంది. లేదంటే వచ్చే నెల పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి వచ్చే నీటిని మళ్లించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలావుండగా రిజర్వాయర్ నీటి సామర్థ్యం 1.17 టీఎంసీలు కాగా దాంట్లో 30 శాతం వరకు పూడిక ఉందని అధికారులు గుర్తించారు. పూడిక తీయడానికి అనేకసార్లు ప్రతిపాదించినా నిధుల కొరతతో పనులు ముందుకుసాగలేదు. రిజర్వాయర్ నుంచి నీటిని వాడుకుంటున్న జీవీఎంసీ ఇంతవరకూ జల వనరుల శాఖకు రూ.51 కోట్ల బకాయి ఉంది. అవి చెల్లిస్తే రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, పూడికతీత వంటివి చేపట్టే అవకాశం ఉంది.