Share News

అడుగంటిన కోనాం

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:43 AM

కోనాం జలాశయం అడుగంటింది. నిర్వహణ పనుల కోసం జలాశయంలో ఉన్న సాగునీటిని బొడ్డేరు నదిలోకి విడిచిపెట్టడంతో జలాశయంలో చుక్కనీరు కూడా లేకుండాపోయింది. పనుల నిర్వహణలో కాంట్రాక్టర్‌ అలసత్వం వహించడంతో కురిసిన వర్షపు నీరు సైతం బొడ్డేరు నదిలోకి పోయింది. దీంతో జలాశయం పరిధిలో ఐదు మండలాలకు చెందిన 13 వేల ఎకరాల వరిసాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

అడుగంటిన కోనాం
స్పిల్‌వే గేటు వద్ద చుక్కనీరు లేని దృశ్యం

- జలాశయం నిర్వహణ పనుల కోసం సాగునీరు బొడ్డేరు నదిలోకి విడుదల

- కాంట్రాక్టర్‌ అలసత్వంతో వర్షపు నీరు కూడా నదిలోకి..

- నీరు లేక బీడు భూములుగా మారిన సాగునీటి చెరువులు

- 13 వేల ఎకరాల సాగుకు తప్పని ఇబ్బందులు

- వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

చీడికాడ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కోనాం జలాశయం అడుగంటింది. నిర్వహణ పనుల కోసం జలాశయంలో ఉన్న సాగునీటిని బొడ్డేరు నదిలోకి విడిచిపెట్టడంతో జలాశయంలో చుక్కనీరు కూడా లేకుండాపోయింది. పనుల నిర్వహణలో కాంట్రాక్టర్‌ అలసత్వం వహించడంతో కురిసిన వర్షపు నీరు సైతం బొడ్డేరు నదిలోకి పోయింది. దీంతో జలాశయం పరిధిలో ఐదు మండలాలకు చెందిన 13 వేల ఎకరాల వరిసాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

చీడికాడ, మాడుగుల, బుచ్చెయ్యపేట, చోడవరం దేవరాపల్లి మండలాల్లో ఉన్న సుమారు 13 వేల ఎకరాలకు సాగునీటి కోసం 45 ఏళ్ల క్రితం కోనాంలో జలాశయం నిర్మించారు. శిరిజాం, మర్లగుమ్మి, మంగళాపురం ఆనకట్టలు, హైలెవెల్‌ చానల్‌తో పాటు కాలువలు నిర్మించారు. సాగునీరు చివరి భూముల వరకు అందించేందుకు 2006లో లైనింగ్‌ పనులు సైతం చేశారు. కాగా గత 15 సంవత్సరాలుగా జలాశయంలో సమస్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఎగువ, దిగువ కాలువల గేట్లు, మూడు మెయిన్‌గేట్లు పనిచేయకపోవడంతో పాటు వివిధ సమస్యలు ఉండడంతో ప్రభుత్వం రూ.85 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి జలాశయంలో ఉన్న సాగునీటిని అధికారులు దిగువకు విడిచిపెట్టి సంబంధిత కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తున్నారు. ఈ ఏడాది మే 31 నాటికి గేట్ల పనులు పూర్తి చేశారు. కాగా ఏప్రిల్‌లో సరాసరి వర్షపాతం 3.5 మిల్లీమీటర్లుకాగా, 33.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మే నెలలో 71.9 మిల్లీమీటర్లుకు గాను 139.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అయితే పనుల నిర్వహణలో కాంట్రాక్టర్‌ అలసత్వం వహించడంతో కురిసిన వర్షం సైతం బొడ్డేరు నదిలోకి పోయింది. దీంతో సాగునీటి కాలువల కింద ఉన్న చెరువులు, వర్షాధార చెరువుల్లో నీరులేక బీడు భూములుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపాధి పథకం ద్వారా సాగునీటి చెరువులు, కాలువల్లో పూడికలు, తుప్పలు తొలగించి సిద్ధం చేయగా, మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాలకు 850 టన్నులు వరి విత్తనాలు పంపిణీకి సిద్ధం చేశారు. పొలాల్లో వరి విత్తనాలు జల్లేందుకు రైతులు నారుమడులను సిద్ధం చేశారు. అయితే జలాశయంలో, చెరువుల్లో చుక్కనీరు లేకపోవడంతో విత్తనాలు వేయడానికి వెనుకడుగు వేస్తూ రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. జూలైలో వర్షాలు కురిస్తే తప్ప 13 వేల ఎకరాల్లో వరినాట్లు వేసే ప్రసక్తి ఉండదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జలవనరులశాఖ డీఈఈ చింతల వేణుగోపాలనాయుడు, ఏఈఈ బి.వి.సత్యనారాయణదొరలను వివరణ కోరగా, జలాశయం గరిష్ఠ స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లుకాగా, ప్రస్తుతం డెడ్‌స్టోరేజీలో ఉందన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 2వ వారంలోనైనా సాగునీటి విడుదలకు ప్రయత్నిస్తామని వారు తెలిపారు.

Updated Date - Jul 05 , 2026 | 12:43 AM