ఎండిన మత్స్యగెడ్డ
ABN , Publish Date - May 01 , 2026 | 12:17 AM
వేసవి ఆరంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతుండడంతో జిల్లాలోని మత్స్యగెడ్డ పాయలు పలుచోట్ల ఎండిపోయాయి.
తాగునీటికి అప్పుడే తిప్పలు
ఆందోళనలో మత్స్యగెడ్డ పరివాహక ప్రజలు
జలాశయాల్లో తగ్గుముఖం పడుతున్న నీటి నిల్వలు
ముంచంగిపుట్టు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): వేసవి ఆరంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతుండడంతో జిల్లాలోని మత్స్యగెడ్డ పాయలు పలుచోట్ల ఎండిపోయాయి. దీంతో ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోవలసి వస్తోందని మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధానంగా మండలానికి జీవనాడి అయిన మత్స్యగెడ్డ పాయలు ఎండల దెబ్బకు సుజనకోట, జోలాపుట్టు, రంగబయలు, పనసపుట్టు, పెదగూడ తదితర పంచాయతీల పరిధిలో పలుచోట్ల పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. మత్స్యగెడ్డ పాయలు ఎండిపోవడం, మరోవైపు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ ఊర్లో చూసినా తాగునీటికి ప్రజలు తిప్పలు పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి, ఎక్కడో ఉన్న చిన్నపాటి ఊటల వద్ద గంటల తరబడి పడిగాపులు కాసి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మత్స్యగెడ్డ నీటిపై ఆధారపడి ఉన్న జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో సైతం నీటి నిల్వలు రోజురోజుకు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు ఈ ప్రాంతంలో తాగు, సాగు నీటికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. వేసవి ఇంకా పూర్తి స్థాయిలో రాకముందే ఈ స్థాయిలో ఎండలు, నీటి ఎద్దడి ఉంటే మే నెలలో పరిస్థితి ఏంటని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గెడ్డ పరివాహక ప్రాంతాలతోపాటు ఇతర గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.