Share News

కలగా వంతెనల నిర్మాణాలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:12 PM

మండలంలోని కాకరపాడు నుంచి కొయ్యూరు వెళ్లే ప్రధాన రహదారిలో రెండు చోట్ల వంతెనల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. దీంతో వర్షాకాలం వస్తే మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి.

కలగా వంతెనల నిర్మాణాలు
కాకరపాడు వద్ద కొండవాగు ప్రవాహంతో నిలిచిన రాకపోకలు(ఫైల్‌ఫొటో)

ఏళ్ల తరబడి నిర్మించని వైనం

ప్రతిపాదనలకే పరిమితమైన వంతెనలు

వర్షాకాలంలో రోడ్డుపై నుంచే పారుతున్న గెడ్డలు

కాకరపాడు నుంచి కొయ్యూరు

రోడ్డులో నిలిచిపోతున్న రాకపోకలు

రోడ్డు విస్తరణకు కూడా పడని అడుగులు

కొయ్యూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మండల ప్రజలు వర్షాకాలం వస్తుందంటే భయపడుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రానికి కాకరపాడు నుంచి నేషనల్‌ హైవే 516 నుంచి 4 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బీ రోడ్డు ఉంది. ఈ రోడ్డులో రెండు చోట్ల కొండ వాగులు ప్రవహిస్తున్నాయి. కాకరపాడు వద్ద కొండవాగుపైన, శింగవరం ఐటీడీఏ కాలనీల మధ్య వట్టిగెడ్డ దాటుకొని కొయ్యూరు చేరాలి. కాకరపాడు నుంచి మండల కేంద్రానికి ఈ రహదారి తప్పితే మరో దారి లేదు. ఈ నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న బీటీరోడ్డు 12 అడుగులు వెడల్పుతో ఉంది. ఈ రెండు వంతెనల నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకరపాడు వద్ద కొండవాగుపై వంతెనకు రూ.2 కోట్లు, వట్టిగెడ్డపై వంతెనకు రూ.1.5 కోట్లు అవసరమని ప్రతిపాదనలు తయారు చేసింది. అలాగే రహదారి విస్తరణకు మరో రూ.4 కోట్లు కావాలంటూ రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదించింది. అయినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఈ రోడ్డు, వంతెనలు పూర్తయితే కొయ్యూరుతో పాటు మరో ఐదు పంచాయతీలకు చెందిన 60 గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. మైదాన ప్రాంతానికి లేదా ఏదేని అనారోగ్య పరిస్థితులలో నర్సీపట్నం, ఏరియా ఆసుపత్రికి వెళ్లాలంటే ఈ రహదారే ఆధారం. వర్షాకాలంలో ఈ రెండు వాగులు ఉధృతంగా ప్రవహించడం, ఆ సమయంలో రాకపోకలు నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అత్యవసర వైద్య సేవలకు వెళ్లాల్సిన రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. రెండు వాగులపై వంతెనల నిర్మాణానికి కూటమి ప్రభుత్వంలో అయినా మోక్షం లభిస్తుందనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై రోడ్లు భవనాల శాఖ చింతపల్లి ఏఈ జయరాజ్‌ను సంప్రదించగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రహదారి విస్తరణ, రెండు వంతెనల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 11:12 PM