Share News

ఆశాజనకంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:57 PM

జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల పెంపకం ఆశాజనకంగా ఉంది. వాస్తవానికి ఉపాధి హామీ పథకంలో చెరువులు, పంట కుంటలు తవ్వడం, రోడ్లు వేయడమే ఇన్నాళ్లు చూశారు.

ఆశాజనకంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు
ముంచంగిపుట్టు మండలం లుంగాపుట్టులో డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు

మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా జిల్లాలో 14.5 ఎకరాల్లో పంట

తొలిసారిగా ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారులకు శతశాతం రాయితీ

వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.2.25 లక్షల ఆదాయం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల పెంపకం ఆశాజనకంగా ఉంది. వాస్తవానికి ఉపాధి హామీ పథకంలో చెరువులు, పంట కుంటలు తవ్వడం, రోడ్లు వేయడమే ఇన్నాళ్లు చూశారు. కానీ అందుకు భిన్నంగా గిరిజన రైతులకు శాశ్వత ఆదాయం లభించేలా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును 2023లో ప్రయోగాత్మకంగా పరిచయం చేశారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 29 మంది లబ్ధిదారులతో 14.5 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు శ్రీకారం చుట్టారు. సాగుకు అవసరమైన సామగ్రి, పరికరాలు సైతం గిరిజన రైతులకు ఉచితంగా అందించడంతో పాటు నాలుగేళ్ల సాగుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వమే అందిస్తున్నది.

ఏజెన్సీలో జాతీయ ఉపాధి హామీ పథకంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టడం ఇదే తొలిసారి. ప్రయోగాత్మకంగా ఆసక్తి వున్న 29 మంది గిరిజన రైతులతో జిల్లా వ్యాప్తంగా 14.5 ఎకరాల్లో 2023లో సాగు ప్రారంభించారు. జిల్లాలో చింతపల్లి మండలంలో 6 ఎకరాల్లో 12 మంది లబ్ధిదారులు, ముంచంగిపుట్టులో 3 ఎకరాల్లో ఆరుగురు, వై.రామవరంలో అర ఎకరంలో ఒకరు, డుంబ్రిగుడలో 2 ఎకరాల్లో నలుగురు, కొయ్యూరు, జి.మాడుగుల ప్రాంతాల్లో ఎకరంన్నర చొప్పున ముగ్గురేసి లబ్ధిదారులు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపడుతున్నారు.

ఏడాదికి రూ.2.25 లక్షల ఆదాయం

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టిన గిరిజన రైతులకు నాలుగేళ్లకు ఎకరానికి ఏడాదికి రూ.2 లక్షల 25 వేలు ఆదాయం లభిస్తుందని అఽధికారులు తెలిపారు. లబ్ధిదారుడికి శత శాతం రాయితీపై ఈ సాగుకు ప్రోత్సహిస్తున్నారు. ఒక ఎకరానికి 900 మొక్కలు, రూ.1,33,707 విలువ చేసే 225 స్తంభాలు ఇస్తారు. అలాగే వాటిని పాతినందుకు గానూ ఉపాధి కూలీ కింద రూ.54 వేల 260 వేతనంగా ఇస్తారు. దీంతో తొలి ఏడాది మొక్కలు నాటే ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే మరో రెండేళ్లు వాటిని సంరక్షించినందుకు గానూ ఏడాదికి రూ.15,100 చొప్పున వేతనం ఇస్తారు. దీంతో మొక్క నాటిన నాలుగో ఏడాది నాటికి ఒక్కో మొక్కకు 4 నుంచి 5 కిలోల డ్రాగన్‌ ఫ్రూట్స్‌ దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో కిలో రూ.500 వరకు ధర ఉందని, దీంతో ఎకరానికి తక్కువగా చూసుకున్నా రైతుకు రూ.2 లక్షల 25 వేలు ఆదాయం వస్తుందని ఉపాధి హామీ పథకం అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొక్కలు చక్కగా పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ క్రమంలో గిరిజన రైతులు వాటిపై ప్రత్యేక శ్రద్ధకనబరిస్తే మరింతగా దిగుబడి, చక్కని ఆదాయం లభిస్తుందని ఉద్యానవనాధికారులు అంటున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:57 PM