17న వార్డుల విభజన ముసాయిదా ప్రతిపాదన
ABN , Publish Date - May 15 , 2026 | 01:03 AM
పురపాలక సంఘం వార్డుల విభజన ముసాయిదా ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మునిసిపాలిటీలో 61,540 మంది జనాభా ఉన్నారు.
గత నెలలోనే సర్వే పూర్తి
జనగణన కారణంగా గడువు పెంచిన ప్రభుత్వం
ఈ నెల 18 నుంచి 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ
జూన్ 24 నుంచి 26లోగా వార్డుల విభజన తుది నివేదిక
నర్సీపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం వార్డుల విభజన ముసాయిదా ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మునిసిపాలిటీలో 61,540 మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వ జీవో ఎంఎస్ 64 ప్రకారం 60 వేల నుంచి 80 వేలలోపు జనాభా ఉంటే 40 వార్డులు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఉన్న 28 వార్డులు 40 వార్డులకు పెరిగింది. మునిసిపల్ కమిషనర్ సురేంద్ర, టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది సర్వే చేసి జనాభా, ఓటర్ల ఆధారంగా వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేశారు. గత నెలలోనే ముసాయిదా ప్రతిపాదన ప్రకటించాల్సి ఉండగా జనగణన కారణంగా ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నెల 17న వార్డుల విభజన ముసాయిదా ప్రతిపాదనను మునిసిపల్ అధికారులు ప్రకటించబోతున్నారు. 18 నుంచి 24 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడానికి ఏడు రోజులు గడువు ఇచ్చారు. గడువులోపు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 25 నుంచి జూన్ 5లోగా మునిసిపల్ కమిషనర్ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తారు. సదరు నివేదికను పరిశీలించిన కలెక్టర్ జూన్ 6 నుంచి 11 లోపు జిల్లా మునిసిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్‌కు సమర్పిస్తారు. మునిసిపల్ పాలకవర్గం తీర్మానం, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను, కలెక్టర్, మునిసిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. జూన్ 24 నుంచి 26లోగా వార్డుల విభజన తుది నివేదికనను మునిసిపల్ కమిషనర్ విడుదల చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 వార్డుల్లో సుమారుగా వార్డుకు 1,539 మంది జనాభా, 1,230 మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు.