Share News

ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితా సిద్ధం

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:51 AM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం ఉన్న 1,980 పోలింగ్‌ కేంద్రాల పునర్వవ్యస్థీకరణకు సంబంధించిన ముసాయిదా జాబితాను ప్రచురించినట్టు జిల్లా ఎని కల అధికారి, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌కిశోర్‌ తెలిపారు.

ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితా సిద్ధం

15 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం ఉన్న 1,980 పోలింగ్‌ కేంద్రాల పునర్వవ్యస్థీకరణకు సంబంధించిన ముసాయిదా జాబితాను ప్రచురించినట్టు జిల్లా ఎని కల అధికారి, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌కిశోర్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రతి పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన చోట కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ప్రస్తుత కేంద్రాల వివరాల్లో మార్పులు, స్థానమార్పులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా జాబితాను రూపొందించామన్నారు. వీటిని అన్ని ఎలక్ర్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ అధికారుల కార్యాలయాలు, కలెక్టరేట్‌లో ప్రజల పరిశీలనార్థం అందు బాటులో ఉంచామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు, ప్రస్తుత శాసనసభ్యులు, పార్లమెం ట్‌ సభ్యులకు జాబితా ప్రతులను అందించామన్నారు. జాబితాల్లో అభ్యంతరాలు, సూచనలు, మార్పుల ప్రతిపాదనలను సంబంధిత ఎలక్ర్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ అధికారికి లేదా కలెక్టర్‌ కార్యాలయానికి ఈ నెల 15లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలన్నారు. వాటిని పరిశీలించి ఈసీ నిబంధనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.


భగ్గుమన్న గ్యాస్‌ ధర

ఒక్కో సిలిండర్‌పై రూ.29 పెంపు

విశాఖలో సిలిండర్‌ రూ.950

నెలకు సగటున 3.5 లక్షల సిలిండర్ల వినియోగం

జిల్లా వాసులపై రూ.కోటి అదనపు భారం

విశాఖపట్నం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ (డొమెస్టిక్‌ సిలిండర్‌)పై కేంద్రం మరోసారి భారం మోపింది. ఏకంగా రూ. 29 పెంచింది. దీంతో జిల్లాలో 14.2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.950కు చేరింది. పశ్చిమాసియా సంక్షోభంతో మూడునెలల క్రితం ఒక్కో సిలిండర్‌పై రూ.60 పెంచిన కేంద్రం తాజాగా మరో రూ.29 పెంచింది. మూడు నెలల క్రితం వరకు డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 861 ఉండేది. రెండు సార్లు ధర పెంచడంతో నగరంలో సిలిండర్‌ ధర రూ.950కు చేరింది.

జిల్లాలో 62 గ్యాస్‌ ఏజెన్సీలలో 8,34,450 డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు సగటున మూడున్నర లక్షల సిలిండర్లు వినియోగిస్తున్నారని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. దీంతో నెలకు నగరంలో గ్యాస్‌ వినియోగదారులపై రూ.కోటి అదనపు భారం పడుతుందని అంచనా. అయితే గడచిన 20 రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడంతో ప్రజలపై పెనుభారం పడింది. ఇంకా వాణిజ్య సిలిండర్‌పై రెండుమూడుసార్లు ధరలు పెరిగాయి. దీంతో చిరువ్యాపారులపై భారం పడడంతో వారంతా డొమెస్టిక్‌ సిలిండర్లు వినియోగిస్తున్నారు.


ఆరోగ్యశాఖలో ఆకలి కేకలు!

కాంట్రాక్టు ఉద్యోగులకు మూడు నెలలుగా అందని వేతనాలు

జిల్లాలో సుమారు వెయ్యిమంది సిబ్బంది

ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన

విశాఖపట్నం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వందలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఆకలి కేకలు పెడుతున్నారు. సుమారు వెయ్యిమందికిపైగా ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కేజీహెచ్‌, విమ్స్‌ తోపాటు పలు బోధనాస్పత్రుల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బందికి వేతనాలు అందడం లేదు. చివరిగా ఫిబ్రవరిలో వేతనాలు అందుకున్న వీరికి మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశల మేరకు నిధి పోర్టల్‌లో సదరు ఉద్యోగులకు సంబంధించిన వివరాలను నమోదు చేసినప్పటికీ, వేతనాల చెల్లించలేదు. ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం కనిపించలేదని వారంతా వాపోతున్నారు. బిల్లులు ప్రాసెస్‌లో ఉన్నాయని, కొద్దిరోజుల్లో వేతనాలు జమవుతాయని చెబుతున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి అప్పులు చేయాల్సి వస్తోందని ఓ కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సు వాపోయారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. కాగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనిష్టంగా రూ.18 వేల నుంచి గరిష్టంగా రూ.38 వేల వరకు ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నారు. మూడు నెలలు పెండింగ్‌లో ఉండడంతో ఒక్కో ఉద్యోగికి రూ.54 వేల నుంచి రూ.1.14 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.

చెల్లింపు ప్రక్రియలో మార్పు

గతంలో కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా వేతనాలు చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం ఈ విధానంలో మార్పుచేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిధి పేరుతో పోర్టల్‌ ఏర్పాటు చేసింది. ఇందులో వివరాలను నమోదుచేసేలా గతంలోనే అధికారులకు ఆదేశాలందాయి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడంతో వేతనాలు ఆలస్యమైనట్టు చెబుతున్నారు. మరో వైపు ట్రెజరీలో కూడా అభ్యంతరాలు రావడం, మళ్లీ వాటిని అప్‌లోడ్‌ చేయడం తో చెల్లింపు మరింత జాప్యమయినట్టు తెలుస్తోంది. తాజాగా వారి వేతనాలను ట్రెజరీ అధికారులు ప్రాసెస్‌లో పెట్టారని, ఈనెల మూడోవారానికి జమవుతాయని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:51 AM