రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:41 AM
జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రాథమిక ముసాయిదాను జీవీఎంసీ అధికారులు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది.
జీవీఎంసీలో 120 వార్డుల సరిహద్దులు, అభ్యంతరాలతో నివేదిక
పునర్విభజనపై నేడు హైకోర్టు తుది నిర్ణయం
ఆమేరకు చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం
రెండు, మూడురోజుల్లో నోటిఫికేషన్ జారీచేసే అవకాశం
విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రాథమిక ముసాయిదాను జీవీఎంసీ అధికారులు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. 98 వార్డులను 120కు పెంచుతూ జీవీఎంసీ కమిషనర్ జారీచేసిన ప్రాథమిక ముసాయిదాపై ప్రజల నుంచి అందిన అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించిన అధికారులు తుదిముసాయిదా తయారుచేసి ప్రభుత్వానికి నివేదించే సమయంలో హైకోర్టు స్టే విధించడంతో బ్రేక్‌పడింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టగా, 23 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజనపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆయా చోట్ల కోర్టు స్టే విధించింది. పిటిషన్లపై విచారణ జరిపి తుదినిర్ణయం తీసుకునే బాధ్యతను సింగిల్‌బెంచ్‌కు అప్పగించడంతో సోమవారం దీనిపై నిర్ణయం వెలువడనున్నది. కాగా అక్టోబరు నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వవహించాలని ప్రభుత్వం భావిస్తుండడంతో కోర్టు నిర్ణయం పునర్విభజనకు అనుకూలంగా వస్తే వార్డుల జాప్యం లేకుండా అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించి తుది ముసాయిదాను సిద్ధంచేసి సోమవారానికి అందజేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు శని, ఆదివారాల్లో యుద్ధ ప్రాతిపదికన వార్డుల పునర్విభజన ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, తుది ముసాయిదాను తయారుచేసి వార్డుల జనాభా, సరిహద్దులతో కూడిన వివరాలను జీవీఎంసీ కమిషనర్ ద్వారా రాష్ట్రప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. సోమవారం కోర్టులో వార్డుల పునర్విభజనకు అడ్డంకిలేదని తేలితే ముసాయిదాను లోతుగా పరిశీలించిన తర్వాత రెండు, మూడు రోజుల్లో 120 వార్డులకు సరిహద్దులను ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వార్డుల పునర్విభజనను కోర్టు తప్పుబడితే వార్డుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ గతంలో మాదిరిగా 98 వార్డులతో జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో రోడ్లు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులకు రూ.400 కోట్లు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి జారీచేసిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో 205 కిలోమీటర్లు పొడవున ఉన్న మట్టిరోడ్లు, వరదనీటి రాపిడి కారణంగా దెబ్బతిన్న రోడ్లు నిర్మాణం, సెంట్రల్ మీడియన్లు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీల అభివృద్ధి పనులను చేపడతామన్నారు. ఈ నిధులతో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ చెరో రూ.200 కోట్లు చొప్పున పనులను చేపడతాయన్నారు. ఏయే పనులు చేపట్టాలనే దానిపై సమగ్ర సర్వే చేపట్టిన తర్వాత స్థానిక అవసరాలు, ప్రాధాన్యత ఆధారంగా పనులు చేపట్టేందుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం నుంచి జారీకావడానికి కృషిచేసిన మునిపల్ శాఖా మంత్రి పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.