విమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ కె.మన్మథరావు
ABN , Publish Date - May 27 , 2026 | 12:47 AM
ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలో సీనియర్ ప్రొఫెసర్లుగా పనిచేస్తూ కొద్దిరోజుల కిందట అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ)గా పదోన్నతులు పొందిన పలువురికి కీలక పోస్టింగ్‌లు లభించాయి.
రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా కేజీహెచ్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం
శ్రీకాకుళం సూపరింటెండెంట్‌గా గైనిక్ విభాగాధిపతి డాక్టర్ సౌమిని
విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలో సీనియర్ ప్రొఫెసర్లుగా పనిచేస్తూ కొద్దిరోజుల కిందట అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ)గా పదోన్నతులు పొందిన పలువురికి కీలక పోస్టింగ్‌లు లభించాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని కేజీహెచ్‌లో జనరల్ సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.మన్మథరావును విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) డైరెక్టర్‌గా నియమించింది. ఇప్పటి వరకు విమ్స్ డైరెక్టర్‌గా కొనసాగిన డాక్టర్ కె.రాంబాబు ఇకపై కేజీహెచ్‌లోని జనరల్ మెడిసిన్ విభాగ ప్రొఫెసర్‌గా కొనసాగ నున్నారు. అలాగే, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ కేఏవీ సుబ్రహ్మణ్యం రాజమహేంద్ర వరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, గైనకాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ జి.సౌమిని శ్రీకాకుళంలోని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, జనరల్ సర్జరీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ వి.రాజ్‌కమల్‌ను శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు.