మెడికల్ కాలేజీ ‘ప్రొఫెసర్ ఎమెరిటస్’గా డాక్టర్ హేమలత
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:04 AM
స్థానిక మెడికల్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవిని ఇదే కాలేజీలో ‘ప్రొఫెసర్ ఎమెరిటస్’గా ప్రభుత్వం నియమించింది.
మెడికల్ కాలేజీ ‘ప్రొఫెసర్ ఎమెరిటస్’గా డాక్టర్ హేమలత
ఆమె మన్యంలో తొలి వైద్యురాలు
ఆమె ప్రతిభ, సేవలకు ప్రత్యేక గుర్తింపు
పాడేరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి)
స్థానిక మెడికల్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవిని ఇదే కాలేజీలో ‘ప్రొఫెసర్ ఎమెరిటస్’గా ప్రభుత్వం నియమించింది. వైద్య రంగంలోని సీనియర్ ప్రొఫెసర్ లేదా విశ్రాంత ప్రొఫెసర్‌లను ప్రత్యేక బోధన కోసం ‘ప్రొఫెసర్ ఎమెరిటస్’గా నియమిస్తారు. వైద్య రంగంలో తమకున్న అనుభవాన్ని వైద్య విద్యార్థులకు బోధించి, భవిష్యత్‌లో చక్కని వైద్యులను సమాజానికి అందించేందుకు ఇటువంటి చర్యలు చేపడతారు. తొలి గిరిజన మహిళా వైద్యురాలైన ఆమె సేవలు, ప్రతిభకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. చింతపల్లి మండలం లబ్బంగి గ్రామానికి చెందిన హేమలత మెడిసన్ పూర్తి చేసి 1992లో జి.మాడుగుల పీహెచ్‌సీ వైద్యురాలిగా వైద్యరంగంలో తొలి అడుగు వేశారు. దీంతో మన్యానికి చెందిన తొలి మహిళా వైద్యురాలిగా ఆమె గుర్తింపు పొందారు. క్రమంగా పదోన్నతి పొందుతూ కేజీహెచ్‌లో 26 ఏళ్లు అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. విశాఖ ఘోషాసుపత్రి సూపరింటెండెంట్‌గా, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో గైనిక్ విభాగాధిపతిగా, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సీటిలో ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్‌గా, స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా రెండున్నరేళ్లు పనిచేసి ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ పొందారు. ఈక్రమంలో ఆమె పనిచేసిన ప్రతి ప్రాంతంలోనూ రూ. కోట్లాది రూపాయలు సీఎస్‌ఆర్ నిధులను సమీకరించి ఆయా ఆస్పత్రులకు ఆధునిక పరికరాలు అందించారు. ఆమె ప్రతిభ, సేవలను గుర్తించిన ప్రభుత్వం స్థానిక మెడికల్ కాలేజీకి ’ప్రొఫెసర్ ఎమెరిటస్’గా నియమించింది. గిరిజన తొలి వైద్యురాలైన ఆమెకు చక్కని గుర్తింపు దక్కడంపై మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.