వెల్లంకి ఎన్నికల అధికారికి డీపీవో షోకాజ్
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:08 AM
ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ సర్పంచ్ పదవికి బోయ వెంకటరమణ నామినేషన్ ఉపసంహరణ వ్యవహారంలో వెల్లంకి స్టేజ్-1 ఎన్నికల అధికారి ఆర్..నరసింగరావుకు జిల్లా పంచాయతీ ఎన్నికల అధికారి ఎంవీఎన్ శ్రీనివాసరావు షోకాజ్ ఇచ్చారు.
గంభీరంలో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ వ్యవహారం
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ సర్పంచ్ పదవికి బోయ వెంకటరమణ నామినేషన్ ఉపసంహరణ వ్యవహారంలో వెల్లంకి స్టేజ్-1 ఎన్నికల అధికారి ఆర్..నరసింగరావుకు జిల్లా పంచాయతీ ఎన్నికల అధికారి ఎంవీఎన్ శ్రీనివాసరావు షోకాజ్ ఇచ్చారు. వెంకటరమణ నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు ధ్రువీకరిస్తూ ఒక రశీదు ఇచ్చారు. ఆ రశీదుపై ఎన్నికల అధికారి సంతకం, స్టాంపు ఉంటాయి. ఆ రశీదు కేవలం వెంకటరమణకు మాత్రమే ఇవ్వాలి. కానీ రశీదు వాట్సాప్ గ్రూపు ద్వారా డీపీవోకు చేరింది. నామినేషన్ విత్‌డ్రా చేసుకున్న వ్యక్తి వద్ద మాత్రమే ఉండాల్సిన రశీదు ఇతరుల వద్దకు ఎలా వెళ్లిందో చెప్పాలని స్టేజ్-1 ఎన్నికల అధికారికి శనివారం డీపీవో షోకాజ్ ఇచ్చారు. కాగా గంభీరం వ్యవహారంపై జిల్లా ఎన్నికల అధికారికి డీపీవో నివేదిక అందజేశారు. ఇదిలావుండగా వెల్లంకి స్టేజ్-1 ఎన్నికల అధికారి నరసింగరావు శనివారం జాయింట్ కలెక్టర్ విద్యాధరిని కలిశారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
దువ్వాడ మీదుగా చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు,
చర్లపల్లి-పార్వతీపురం మధ్య నడపనున్నట్టు అధికారుల ప్రకటన
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) :
సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు దువ్వాడ మీదుగా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు.
చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి
చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు (07119) జనవరి 10, 17 తేదీల్లో సాయంత్రం 4.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుతుంది. శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి ప్రత్యేక రైలు (07120) జనవరి 11, 18 తేదీల్లో మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి మరుసటిరోజు ఉదయం ఏడు గంటలకు చర్లపల్లి చేరుతుంది.
చర్లపల్లి-పార్వతీపురం-చర్లపల్లి
చర్లపల్లి-పార్వతీపురం ప్రత్యేక రైలు (07121) జనవరి 12, 19 తేదీల్లో సాయంత్రం 4.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు పార్వతీపురం చేరుతుంది. పార్వతీపురం-చర్లపల్లి ప్రత్యేక రైలు (07122) జనవరి 13, 20 తేదీల్లో మధ్యాహ్నం రెండు గంటలకు పార్వతీపురంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం ఏడు గంటలకు చర్లపల్లి చేరుతుంది.
రెండో తేదీన సెలవు
పంచాయతీ ఎన్నికలు ఉన్న ప్రాంతాలకు వర్తింపు
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల రెండో తేదీన పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు కోసం ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు మాత్రం డిసెంబరు ఒకటో తేదీ కూడా సెలవు ఉంటుందన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో గల ప్రైవేటు, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు డిసెంబరు రెండో తేదీన వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని లేదా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆరోజు మూడు గంటలపాటు వెసులుబాటు కల్పించాలని ఆదేశించారు. సంబంధిత ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థల ఉద్యోగులు, కార్మికులకు స్థానిక సెలవు వర్తిస్తుందని స్పష్టంచేశారు.
మద్యం దుకాణాలు మూసివేత
పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకూ ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జారీచేసిన ఆదేశాలను అన్ని శాఖల అధికారులు, సంస్థలు, యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
రూ.1.68 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపు
సైబర్ క్రైమ్‌కు నగరవాసి ఫిర్యాదు
ఎండాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
డిజిటల్ అరెస్టు పేరుతో నగరవాసి నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1,68,10,000 కొల్లగొట్టారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. చినవాల్తేరులో నివాసం ఉంటున్న సుఖ్‌దేవ్‌సింగ్ రఖ్రా (69) ఎల్కామ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆయనకు సెప్టెంబరులో ఒక అపరిచిత వ్యక్తి వీడియో కాల్ చేసి యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సుఖ్‌దేవ్‌సింగ్‌కు బెంగళూరులోని ఒక ప్రైవేటు బ్యాంకులో గల ఖాతా గురించి చెబుతూ, అందులో నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్నాయని, అందుకు సమాధానం చెప్పాలని బెదిరించాడు. అరెస్టు నుంచి మినహాయింపు ఉంటుందని, అందుకు కొంత నగదు డిపాజిట్‌గా చూపించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ముద్రతో కూడిన ఒక నకిలీ లేఖను చూపాడు. ఈ క్రమంలో సుఖ్‌దేవ్‌సింగ్ నుంచి అక్టోబరులో దఫదఫాలుగా రూ.46 లక్షలు, రూ.68.8 లక్షలు, రూ.50.3 లక్షలను వేర్వేరు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. బెయిల్ ఇప్పిస్తామంటూ మరో రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోసపోయనని గ్రహించిన బాధితుడు ఈ నెల 26న సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 ద్వారా ఫిర్యాదు చేశారు.