Share News

చిన్నబోయిన గుడ్లు

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:13 PM

ప్రాజెక్టు పరిధి అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న పరిమాణం కలిగిన గుడ్లను ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. ఐసీడీఎస్‌ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల గుడ్లు సరఫరా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

చిన్నబోయిన గుడ్లు
25 గ్రాములు మించని గుడ్డును చూపిస్తున్న గిరిజనుడు

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న పరిమాణం కలిగినవి సరఫరా

పట్టించుకోని ఐసీడీఎస్‌ అధికారులు

చిన్నగెడ్డలో నిలదీసిన స్థానిక గిరిజనులు

చింతపల్లి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టు పరిధి అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న పరిమాణం కలిగిన గుడ్లను ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. ఐసీడీఎస్‌ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల గుడ్లు సరఫరా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సోమవారం చిన్నగెడ్డ అంగన్‌వాడీ కేంద్రానికి చిన్నపరిమాణం కలిగిన గుడ్లు తీసుకురావడంతో స్థానిక గిరిజనులు సరఫరాదారులను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందించేందుకు రూ.కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ఒక గుడ్డు కచ్చితంగా 50 గ్రాములు ఉండాలి. ఒక ట్రేలోని 30 గుడ్లు 1200 గ్రాముల నుంచి 1500 గ్రాములు ఉండాలి. ఈ నిబంధనలకు ఏజెన్సీలు పాటించేలా ఐసీడీఎస్‌ అధికారులు పర్యవేక్షించాల్సి వుంది. అయితే అంగన్‌వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్లు సరఫరా చేసే పోషకాహారం, గుడ్లుపై ఐసీడీఎస్‌ అధికారుల కనీస పర్యవేక్షణ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. చిన్నగెడ్డ అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకొచ్చిన గుడ్లులో అత్యధికంగా చిన్న పరిమాణంలో ఉన్నాయి. ఒక ట్రేలో 15-18 గుడ్లు చాలా చిన్నపరిమాణంలో ఉన్నాయి. ఒక గుడ్డు 25 గ్రాములకు మించిలేదు. చిన్నగెడ్డలో జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌ వద్దకు వచ్చిన స్థానిక గిరిజనులు అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా చేస్తున్న చిన్నపరిమాణం కలిగిన గుడ్లు పరిశీలించి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. చిన్నపరిమాణం కలిగిన గుడ్లు ఎందుకు సరఫరా చేస్తున్నారని సరఫరాదారులను గిరిజనులు ప్రశ్నించగా, కోళ్లఫారం నుంచి వచ్చిన గుడ్లు సరఫరా చేస్తామే తప్ప గుడ్లు కొలతలు చూసే బాధ్యత తమకులేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రానికి చిన్న పరిమాణం గల గుడ్లు సరఫరాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గిరిజనులు విలేకరులకు తెలిపారు.

Updated Date - Aug 31 , 2026 | 11:13 PM