గ్రేటర్ ఎన్నికలపై సందిగ్ధం
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:20 AM
జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం ఈనెల 17వ తేదీతో ముగియనున్నది. 18వ తేదీ నుంచి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. నగర పాలక సంస్థకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా వార్డు రిజర్వేషన్లు ఖరారు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కులగణన ప్రారంభించింది. మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి రానున్నప్పటికీ, జీవీఎంసీలో కొత్తగా పెందుర్తి, భీమిలి మండలాల్లోని మిగిలిన గ్రామాలతోపాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను విలీనం చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉండడంతో వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా?, లేదా?...అనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
ఈ నెల 17తో ముగియనున్న
జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం
తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలన
మూడు నెలల్లో రిజర్వేషన్‌లపై
స్పష్టత వచ్చే అవకాశం
మరోవైపు భీమిలి, పెందుర్తి, పద్మనాభం, ఆనందపురం మండలాలను పూర్తిగా విలీనం చేయాలనే ప్రతిపాదనలు
అదే జరిగితే మరో రెండేళ్లలోపు
ఎన్నికలు అసాధ్యమంటున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం ఈనెల 17వ తేదీతో ముగియనున్నది. 18వ తేదీ నుంచి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. నగర పాలక సంస్థకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా వార్డు రిజర్వేషన్లు ఖరారు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కులగణన ప్రారంభించింది. మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి రానున్నప్పటికీ, జీవీఎంసీలో కొత్తగా పెందుర్తి, భీమిలి మండలాల్లోని మిగిలిన గ్రామాలతోపాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను విలీనం చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉండడంతో వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా?, లేదా?...అనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
జీవీఎంసీకి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. మార్చి 17న పాలకవర్గం కొలువుతీరింది. మెజారిటీ వార్డులను వైసీపీ దక్కించుకోవడంతో వైసీపీకి చెందిన 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకటకుమారి మేయర్‌గా ఎన్నికయ్యారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో జీవీఎంసీ కౌన్సిల్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, స్వతంత్రులుగా గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. దీంతో కౌన్సిల్‌లో కూటమి బలం పెరిగింది. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్‌పై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవుల్లో ఉన్నవారు వైదొలిగారు. టీడీపీకి చెందిన 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మేయర్‌గా, జనసేనకు చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. కాగా ఐదేళ్లు పూర్తవుతుండడంతో తాజా పాలకవర్గం ఈ నెల 17వ తేదీన రద్దవుతుంది. తిరిగి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాలంటే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయడంలో భాగంగా నిర్ణీత కాలానికి కులగణన చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు లోబడి ప్రకటన చేయాల్సి ఉంటుంది. కులగణన ప్రారంభించారు. అది ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం, రిజర్వేషన్లను ఖరారు చేయడం, వాటిపై గెజిట్ జారీచేసి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం వంటివి పూర్తికావాలంటే కనీసం మూడు నెలలు పడుతుందని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్నికల ప్రధానాధికారి జీవీఎంసీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం పెందుర్తి, భీమిలి నియోజవర్గాల్లోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. మిగిలిన గ్రామాలతోపాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను కూడా జీవీఎంసీ పరిధిలోకి చేర్చాలని ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ దిశగా నిర్ణయం తీసుకోదలిస్తే మాత్రం రెండేళ్ల వరకూ జీవీఎంసీకి ఎన్నికలు జరగకపోవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు.