విలీనంపై సందిగ్ధం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:40 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో నాలుగు గ్రామీణ మండలాల విలీనంపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతానికి ఆ అవకాశం లేనట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జీవీఎంసీలో నాలుగు గ్రామీణ మండలాలను కలపాలని ఇటీవల సీఎంను కోరిన ఎమ్మెల్యేలు
సూత్రప్రాయంగా అంగీకారం
...అయితే తాజాగా జనాభా లెక్కల సేకరణకు షెడ్యూల్ విడుదల
ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ స్థానిక సంస్థల మౌలిక స్వరూపం మార్చవద్దంటూ కేంద్రం ఆదేశాలు
మరోవైపు పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తయారీ
అందువల్ల ఇప్పట్లో విలీనం సాధ్యం కాకపోవచ్చునంటున్న అధికార వర్గాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో నాలుగు గ్రామీణ మండలాల విలీనంపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతానికి ఆ అవకాశం లేనట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్రం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జనగణన పూర్తయ్యేంత వరకూ స్థానిక సంస్థల మౌలిక స్వరూపంలో మార్పులు ఉండరాదని కేంద్రం పేర్కొనడంతో జీవీఎంసీలో నాలుగు గ్రామీణ మండలాలు విలీనానికి తాత్కాలికంగా బ్రేక్ పడిందనే వాదన వినిపిస్తోంది.
జిల్లాలో ప్రస్తుతం 11 మండలాలు ఉండగా, అందులో ఏడు పూర్తిగా జీవీఎంసీ పరిధిలోకి వస్తాయి. ఇక మిగిలిన నాలుగింటిలో ఆనందపురం, పద్మనాభం మండలాలు పూర్తిగా, భీమిలి, పెందుర్తి మండలాలు సగం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ నాలుగింటిని గ్రామీణ మండలాలుగా అధికారులు గుర్తించారు. నాలుగు గ్రామీణ మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలని కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో సగం జీవీఎంసీలో, మరో సగం గ్రామీణ ప్రాంతంగా ఉండడంతో పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. ఈ ఏడాది మార్చి 18వ తేదీతో జీవీఎంసీ పాలకవర్గం గడువు ముగుస్తుందని, ఆ తరువాత నాలుగు గ్రామీణ మండలాల్లోని 79 పంచాయతీలను విలీనం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. అందుకు సీఎం కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా
దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే 2027 మార్చి నెలాఖరు వరకు సాగుతుంది. ఆ తరువాత జిల్లాల వారీగా లెక్కలను అధికారికంగా ప్రకటిస్తారు. సాధారణంగా జనగణన జరిగే సమయంలో జిల్లాలో మార్పులు చేయరు. అదేవిధంగా షెడ్యూల్ ప్రకటించిన తరువాత నగరాలు, పట్టణాల్లో సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేయరాదని కేంద్రం ఇటీవల సర్క్యులర్ జారీచేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల మౌలిక స్వరూపం మార్పులు చేయడంపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఉన్న సరిహద్దుల మేరకు జనాభా లెక్కల సేకరణ చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నాలుగు మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు, నాలుగు మండలాల్లోని 79 పంచాయతీలు, జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తారా?...అనేది చూడాలి. వచ్చే నెల తొమ్మిదో తేదీన పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు విడుదల చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా త్వరలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తే పంచాయతీలకు ఎన్నికలు జరిగిపోతాయి. ఒకసారి ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటైతే ఐదేళ్ల వరకు ఆయా పంచాయతీల మౌలిక స్వరూపాల్లో మార్పులు ఉండవు. నాలుగు గ్రామీణ మండలాలను విలీనం చేసిన తరువాతే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఆగాల్సి ఉంటుంది.