Share News

ఫైర్‌ స్టేషన్‌కు డబల్‌ పవర్‌

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:13 AM

నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రంపై కాస్త ఒత్తిడి తగ్గనుంది. తొమ్మిది మండలాలకు సేవలందిస్తున్న ఈ కేంద్రాన్ని డబల్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.

ఫైర్‌ స్టేషన్‌కు డబల్‌ పవర్‌
నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం

నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రాన్ని డబల్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రతిపాదనలు

ప్రభుత్వం ఆమోదిస్తే జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పోస్టు మంజూరు

రెట్టింపు కానున్న సిబ్బంది

అందుబాటులోకి రానున్న మరో అధునాతన శకటం

నర్సీపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రంపై కాస్త ఒత్తిడి తగ్గనుంది. తొమ్మిది మండలాలకు సేవలందిస్తున్న ఈ కేంద్రాన్ని డబల్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పోస్టు మంజూరవుతుంది. ప్రస్తుతం ఉన్న 15 మంది సిబ్బంది రెండింతలు పెరుగుతారు. అధునాతన శకటం మరొకటి మంజూరు అవుతుంది. దూర ప్రాంతాలకు కూడా సేవలు సత్వరమే అందుతాయి.

నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం పరిధిలో నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, కోటవురట్ల, రోలుగుంట, నాతవరం, కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాలు ఉన్నాయి. జీకే వీధి మండలం బలపం నర్సీపట్నానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటువంటి సుదూర ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక శకటం గ్రామానికి చేరుకోవడానికి గంటన్నర సమయం పడుతుంది. అంత దూరం వెళ్లి అగ్నిప్రమాదాలు నివారించాలంటే ఫైర్‌ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. తీరా అక్కడి వరకు వెళ్లిన తర్వాత సహాయ చర్యలు చేపట్టే అవకాశం ఉండడం లేదు. ఈలోపు మరో చోట ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉంది. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం సింగిల్‌ యూనిట్‌ స్టేషన్‌ (ఒక శకటం)గా ఉంది. ఒక శకటంతో 70 నుంచి 80 కిలోమీటర్లు వెళ్లి మంటలు అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. దీనికి తోడు ఫైర్‌ స్టేషన్‌లో ఉన్న ఒక శకటం వెళ్లి రావాలంటే నాలుగు గంటలు పడుతుంది. ఇటువంటి సందర్భంలో మరో అగ్నిప్రమాదం జరిగితే రావికమతం (28 కిలోమీటర్లు) నుంచి ఫైర్‌ ఇంజన్‌ను రప్పించాల్సి వస్తుంది. కొయ్యూరు మండలం సింగవరం నర్సీపట్నానికి 51 కిలోమీటర్లు దూరంలో ఉంది. గత నెల 21న ఈ గ్రామంలో ఒక పూరిల్లు దగ్ధమవుతోందని ఎస్‌ఐ రాత్రి 11.40 గంటలకు నర్సీపట్నం ఫైర్‌ స్టేషన్‌కి ఫోన్‌ చేశారు. అగ్నిమాపక కేంద్రం సిబ్బంది శకటంతో బయలుదేరి సింగవరం చేరుకునే సరికి అర్థరాత్రి 1.20 గంటలైంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూరిల్లు పూర్తిగా కాలి బూడిదై ఆ పేదింటికి రూ.1.5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లింది. అలాగే నాతవరం మండలం సరుగుడు పంచాయతీ రామన్నపాలెం దగ్గర దద్దుగుల గ్రామంలో ఫిబ్రవరి నెలలో రెండు పూరిళ్లు, రెండు మేకల దొడ్లు కాలిపోతున్నాయని అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌ వచ్చింది. దద్డుగుల గ్రామం నర్సీపట్నానికి 42 కిలో మీటర్ల దూరంలో ఉంది. అగ్నిమాపక శకటం గ్రామానికి చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఐదేళ్లలో 553 అగ్నిప్రమాదాలు

గత ఐదేళ్లలో 553 అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి. రూ.9 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. సకాలంలో మంటలను అదుపు చేయడం ద్వారా రూ.20 కోట్ల ఆస్తులను కాపాడగలిగారు. ఈ రెండేళ్లలో 2024-25లో 123, అలాగే 2025-26లో 121 అగ్నిప్రమాదాలు జరిగాయి. వాస్తవానికి మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటికి 8 ఫైర్‌ కాల్స్‌ వచ్చాయి. ఈ ప్రాంతంలో జీడిపిక్కల ఫ్యాక్టరీలు, బాణసంచా తయారీ కేంద్రాలు, పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ సిలిండర్ల గోదాములు ఉన్నాయి. వేసవిలో గడ్డివాములు, సరుగుడు, జీడి, చెరుకు తోటలు అధికంగా దగ్ధమవుతుంటాయి. మంటలను అదుపు చేసేందుకు అవసరమైన అధునాతన సామగ్రి, సరిపడా సిబ్బంది అందుబాటులో లేరు. డ్రాగన్‌ లైట్స్‌ లేకపోవడంతో టార్చ్‌ లైట్లు వాడుతున్నారు.

డబల్‌ యూనిట్‌కి ప్రతిపాదనలు

నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రాన్ని డబల్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని గత ఏడాది అక్టోబరులో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక శాఖాధికారి రూ.4.37 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని అధికారులు భావిస్తున్నారు. డబల్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ అయితే కష్టాలు తీరిపోతాయని అంటున్నారు. డబల్‌ యూనిట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే అగ్నిమాపక కేంద్రంలో జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పోస్టు మంజూరవుతుంది. ప్రస్తుతం ఉన్న 15 మంది సిబ్బంది రెట్టింపు అవుతారు. అధునాతన శకటం మరొకటి మంజూరవుతుంది. దీనిపై నర్సీపట్నం అగ్నిమాపక శాఖాధికారి అప్పలస్వామిని వివరణ కోరగా డబల్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో మంజూరవుతుందని ఆయన చెప్పారు.

Updated Date - Apr 12 , 2026 | 12:13 AM