డబుల్ ధమాకా
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:22 AM
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశాలు అనేకం కనిపిస్తున్నాయి.
చెల్లి మేయర్, అక్క కార్పొరేటర్
ముక్కా కుటుంబంలో విజయదరహాసం
కార్పొరేటర్లుగా తండ్రీ, కూతురు...
ఆరు, ఏడు వార్డుల నుంచి ఎన్నిక
విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశాలు అనేకం కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబం నుంచి వేర్వేరు ప్రాంతాల్లో పోటీ చేసిన వ్యక్తులు విజయం సాధించారు. ప్రధానంగా చెప్పుకోవలసింది ముక్కా కుటుంబం గురించే. మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడి కుమార్తె అయిన శ్రావణి గతంలో అంటే 2021లో ఉత్తర నియోజకవర్గం నుంచి 26వ వార్డు కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. అప్పటి ఎన్నికల్లో నియోజకవర్గంలో టీడీపీ తరపున 17 మంది పోటీ చేస్తే శ్రావణి ఒక్కరే విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆమెకు మేయర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించింది. కూటమి నేతలంతా సమన్వయంతో పనిచేయడంతో ఆమె అఖండ విజయాన్ని చేజిక్కించుకున్నారు. అదే కుటుంబంలో శ్రావణి సోదరి (అక్క) పొట్నూరు నీలవేణికి 49వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆమె కూడా అక్కడ గెలుపొందారు. అంటే ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు విజయ పతాకం ఎగరేశారు. ఇది కార్పొరేషన్ చరిత్రలో ఒక రికార్డు. మరోవైపు కూటమి సునామీలో భీమిలి జోన్‌లో ఆరు, ఏడు వార్డుల నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ విజయం సాధించారు. వారిద్దరూ తండ్రీకూతురు కావడం గమనార్హం. ఆరో వార్డు నుంచి పోతిన హనుమంతరావు, ఏడో వార్డు నుంచి జాహ్నవి గెలుపొందారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున కౌన్సిల్ హాల్‌లోకి అడుగుపెడుతుండడం విశేషం. వీరిలో ఒక కుటుంబం అధికార పక్షం కాగా మరొక కుటుంబం ప్రతిపక్షం కావడం కొసమెరుపు.
గ్రేటర్ పదవుల కోసం పోటీ
స్టాండింగ్ కమిటీ చైర్మన్ రేస్‌లో టీడీపీ సీనియర్ కార్పొరేటర్లు
జాబితాలో గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, గాడు చిన్నికుమారిలక్ష్మి, గొలగాని మంగవేణి
జనసేన నుంచి భీశెట్టి వసంతలక్ష్మి, కందుల నళినీకుమార్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఎన్నికలు ముగిశాయి. మేయర్‌గా కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి విజయం సాధించారు. 120 వార్డుల్లో టీడీపీ 64, జనసేన 26, బీజేపీ ఎనిమిది, వైసీపీ 13, సీపీఎం ఒకటి గెలుచుకున్నాయి. మరో ఎనిమిది వార్డుల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మెజారిటీ వార్డులను దక్కించుకోవడంతో కూటమి పార్టీల కార్పొరేటర్లు ఇప్పుడు కౌన్సిల్‌లో పదవులపై దృష్టిసారించారు.
మేయర్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలో జరిగిపోయింది. డిప్యూటీ మేయర్‌ను మెజారిటీ కార్పొరేటర్లు చేతులెత్తేవిధానంలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికను కూడా కార్పొరేటర్లు బ్యాలెట్ విధానంలోనే ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు పార్టీల పరంగా ఫ్లోర్ లీడర్ పదవులను పార్టీ నాయకత్వం ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో కార్పొరేటర్లుగా గెలిచినవారంతా ఆయా పదవులపై పడ్డారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం జనసేన, బీజేపీ పోటీపడే అవకాశం ఉంది. బీజేపీ నుంచి 48వ వార్డు నుంచి గెలిచిన పరశురామరాజు పేరు వినిపిస్తోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏ విధంగా ఉండబోతోందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గతంలో మేయర్‌ను ప్రత్యక్ష విధానంలో ఎన్నుకున్నప్పుడు స్టాండింగ్ కమిటీ చైర్మన్‌తోపాటు సభ్యులను కూడా కార్పొరేటర్లు బ్యాలెట్ ద్వారా ఎన్నుకునేవారు. గత కౌన్సిల్ హయాంలో మాత్రం స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా మేయర్ వ్యవహరించడంతో కేవలం ఏడాదికి ఒకసారి సభ్యులను మాత్రమే ఎన్నుకునేవారు. తాజాగా మేయర్ ఎన్నిక తిరిగి ప్రత్యక్ష విధానంలో జరగడంతో స్టాండింగ్ కమిటీ చైర్మన్, సభ్యుల ఎన్నిక ఏ విధంగా ఉంటుందో తేలాల్సి ఉంది. ఒకవేళ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటే ఆ పదవికి టీడీపీ, జనసేన పోటీ పడే అవకాశం ఉంది. చైర్మన్ పదవి ఉంటే మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీకి చెందిన సీనియర్ కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, గాడు చిన్నికుమారిలక్ష్మితోపాటు గొలగాని మంగవేణి కోరుతున్నట్టు తెలిసింది. అదే జనసేన నుంచి అయితే మాజీ ఫ్లోర్‌లీడర్ బీశెట్టి వసంతలక్ష్మి, కందుల నళినీదేవి పోటీపడే అవకాశం ఉంది. ఒకవేళ స్టాండింగ్‌కమిటీ చైర్మన్‌గా మేయర్‌ను కొనసాగిస్తే మాత్ర ం సభ్యులుగా కొనసాగేందుకు పైనపేర్కొన్న వారెవవరూ ఆసక్తి చూపకపోవచ్చు. అప్పుడు వారంతా పార్టీ ఫ్లోర్‌లీడర్ పదవుల కోసం పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఇండిపెండెంట్లు గెలిచిన ఎనిమిది మందిలో కొల్లి సింహాచలం, బత్తుల నవీన్‌కుమార్ టీడీపీకి మద్దతుగా నిలవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మిగిలినవారు ఎటు మొగ్గుచూపుతారో చూడాలి.