ఇంటీరియర్ పనులకు డబుల్ బిల్లులు
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:48 AM
స్థానిక మహిళా మార్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి అధికారులు ఆరుగురిపైన మాత్రమే చర్యలు తీసుకోవడాన్ని డ్వాక్రా మహిళలు తప్పుబడుతున్నారు. మార్టులో ఇంటీరియర్ పనుల పేరుతో వేర్వేరుగా బిల్లులు పెట్టి, నిధులు స్వాహా చేసిన పంచాయతీ, వెలుగు అధికారులను ఎందుకు వదిలేశారని ప్రశిస్తున్నారు.
నిధులు స్వాహా చేసిన వారిపై చర్యలు శూన్యం
మాడుగుల, ఆగస్టు 6 (ఆంరఽధజ్యోతి): స్థానిక మహిళా మార్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి అధికారులు ఆరుగురిపైన మాత్రమే చర్యలు తీసుకోవడాన్ని డ్వాక్రా మహిళలు తప్పుబడుతున్నారు. మార్టులో ఇంటీరియర్ పనుల పేరుతో వేర్వేరుగా బిల్లులు పెట్టి, నిధులు స్వాహా చేసిన పంచాయతీ, వెలుగు అధికారులను ఎందుకు వదిలేశారని ప్రశిస్తున్నారు. మండలంలో 18 వేల మంది డ్వాక్రా సభ్యుల నుంచి సుమారు రూ.32 లక్షలు వసూలు చేశారని, ఇందులో సుమారు రూ.15 లక్షలను మార్టులో ఇంటీరియర్ పనులు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ర్యాక్‌ల కొనుగోలుకు వెచ్చించారు. మిగలిన సుమారు రూ.17 లక్షలతో సరుకులు కొనుగోలు చేశారు. మార్టులో ఇంటీరియర్ పనులకు రూ.15 లక్షలు ఖర్చు చేయడంపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఒకే పనికి సంబంధించి ఇటు పంచాయతీ, అటు వెలుగు అధికారులు వేర్వేరుగా బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మార్టును ప్రారంభించిన ఏడాదిలోపే అవకతవకలు మొదలయ్యాయి. అమ్మకాలు తగ్గిపోవడం, సరుకులు లేకపోవడంతో వెలుగు అధికారులు గత ఏడాది ఆగస్టులో మార్టును మూసివేశారు. అప్పటికి మార్టు రూ.16 లక్షల నష్టాల్లో వున్నట్టు గుర్తించారు. సరుకుల సరఫరాదారులకు రూ.5 లక్షల బకాయిలు వున్నాయి. మొత్తంగా రూ.21 లక్షల మేర లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారులను ఆదేశించారు. డీఆర్‌డీఏ అధికారులు విచారణ జరిపి, మొత్తం ఆరుగురిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెలుగు సీసీ పి.సోమేశ్వరరావు, మార్టు అధ్యక్షురాలు అడపా అరుణ, కార్యదర్శి ఇమ్మంది అంబిక, మార్టు మేనేజర్ యడ్ల గణేశ్, బిల్లింగ్ సెక్షన్ ఆపరేటర్లు ఉల్లిపల్లి నాగమణి, కుక్కర అరవిందుపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే మార్టులో ఇంటీరియర్ పనుల పేరుతో పంచాయతీ, వెలుగు అధికారులు వేర్వేరుగా బిల్లులు పెట్టుకొని నిధులు దుర్వినియోగం చేశారని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని డ్వాక్రా మహిళలు ప్రశ్నిస్తున్నారు.