సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - May 30 , 2026 | 12:45 AM
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఒక నెల- ఒక నియోజకవర్గం’ కార్యక్రమాన్ని రూపొందించారని, ఇందులో ప్రజలు ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదులను వచ్చే సమావేశంనాటికి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టిన ‘ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని జిల్లాలో చోడవరం నుంచి ప్రారంభించారు.
సత్వర పరిష్కారానికి శ్రద్ధ చూపండి
వచ్చే వారం సమావేశం నాటికి 90 శాతం అర్జీలు క్లియర్ కావాలి
వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించండి
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
చోడవరంలో ‘ఒక నెల- ఒక నియోజకవర్గం’ కార్యక్రమం ప్రారంభం
చోడవరం, మే 29 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఒక నెల- ఒక నియోజకవర్గం’ కార్యక్రమాన్ని రూపొందించారని, ఇందులో ప్రజలు ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదులను వచ్చే సమావేశంనాటికి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టిన ‘ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని జిల్లాలో చోడవరం నుంచి ప్రారంభించారు. శుక్రవారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోలు, అన్ని జిల్లా/మండల శాఖల అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ విజయకృష్ణన్ పలువురి నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్జీలను సంబంధిత అధికారులకు బదలాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పీజీఆర్‌ఎస్‌లలో ప్రజలు అందిస్తున్న అర్జీలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది తగిన విధంగా స్పందించడం లేదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అధికారులు, ఉద్యోగులు ఒకింత శ్రద్ధ చూపితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. చోడవరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన 600కుపైగా అర్జీలు, ఫిర్యాదులనుబట్టి చూస్తే సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది ఏమాత్రం బాధ్యత తీసుకోవడంలేదని అర్థం అవుతున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి వచ్చిన అర్జీలు/ ఫిర్యాదులకు వచ్చే బుధవారంనాటికి (జూన్ 3వ తేదీ) పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. తాగునీటి సమస్యలపై అందిన ఫిర్యాదులపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాజిక పింఛన్లు, అభివృద్ధి పనులపై డీఆర్‌డీఏ అధికారులు, ఎండీవోలు స్పందించాలన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర పనులకు సంబంధించి అందిన అర్జీలపై పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా పనులకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.
మళ్లీ సమావేశంనాటికి 90 శాతం పరిష్కారం కావాలి
ప్రస్తుత సమావేశంలో ప్రజలు అందించిన వాటిలో 90 శాతం అర్జీలను వచ్చే సమావేశం నాటికి పరిష్కరించాల్సిన బాద్యతను ఆయా శాఖల అధికారులు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకవేళ పని చేయలేకపోతే అందుకుగల కారణాన్ని అర్జీదారునికి వివరించాలని చెప్పారు. ఈ సమావేశంలో అందిన అర్జీలు/ ఫిర్యాదులపై వచ్చే సమావేశంలో తొలుత గంటపాటు సమీక్ష ఉంటుందని, తరువాత ఫిర్యాదుల వారీగా రివిజన్ ఉంటుందన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ, ‘ఒక నెల- ఒక నియోజకవర్గం’ కార్యక్రమాన్ని చోడవరం నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగంచేసుకొని సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్‌పటేల్, డీఆర్‌వో వై.సత్యనారాయణ, ఆర్‌డీవోలు అయీషా, వీవీ రమణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, పీఆర్ డీఈ జగదీశ్‌బాబు, పలు శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎండీవోలు, తహశీల్దార్లు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.