గ్యాస్ కబుర్లు నమ్మొద్దు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:53 PM
వంట గ్యాస్ సిలిండర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో వినియోగదారుల్లో టెన్షన్ నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో ప్రస్తుతం మండలాలకు వంట గ్యాస్ సరఫరా సజావుగానే సాగుతున్నది.
పుష్కలంగా సిలిండర్లు
గ్రామీణ ప్రాంతంలో సాఫీగా సరఫరా
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వం
తప్పుడు ప్రచారంతో పెరిగిన గ్యాస్ బుకింగ్‌లు
అనవసర ఆందోళన వద్దంటున్న డీలర్లు
చోడవరం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్ సిలిండర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో వినియోగదారుల్లో టెన్షన్ నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో ప్రస్తుతం మండలాలకు వంట గ్యాస్ సరఫరా సజావుగానే సాగుతున్నది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి టెన్షన్ పడి సిలిండర్లు కోసం రావడం తప్పితే, గ్రామీణ ప్రాంతంలో పెద్దగా వంట గ్యాస్ కోసం ఆందోళన అనవసరమని అధికారులు అంటున్నారు. గతంలో బుక్ చేసిన ఒక్క రోజు తరువాత ఇంటికి వచ్చే సిలిండర్, ప్రస్తుతం రెండు లేదా మూడు రోజులు పడుతున్నది తప్పితే, బుక్ చేసిన అందరికీ వంటగ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నట్టు వంటగ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ ప్రభావం నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత పేరిట ఇటీవల సాగుతున్న అనవసర ప్రచారంతో వినియోగదారుల్లో ఆందోళన పెరిగిన సంగతి తెలిసిందే. అవసరం లేకపోయినా సిలిండర్ దొరకదేమోనన్న ఆందోళనతో ప్రతి ఒక్కరూ గ్యాస్ బుక్ చేసి, గ్యాస్ డీలర్లు, గ్యాస్ గోదాముల వద్దకు వస్తుండడంతో, మిగిలిన వినియోగదారుల్లో కూడా అనవసర ఆందోళన పెరిగినట్టయింది. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మండలాల వారీగా పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులతో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నది. స్థానికంగా గతంలో మాదిరిగా సిలిండర్లు అడిగిన వెంటనే ఇచ్చే పద్ధతి నిలిపివేసి, ప్రాధాన్యతా క్రమంలో బుక్ చేసిన వారికి సిలిండర్ల సరఫరాలో ప్రాధాన్యత ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే వినియోగదారులు కూడా ఎవరికి వారు గ్యాస్ బుకింగ్ చేసుకునేలా చూస్తున్నారు. దీనికి తోడు మండలాలకు వంట గ్యాస్ స్టాకును కూడా రోజూ పంపుతున్నారు.
వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో వంటగ్యాస్ సిలిండర్లు డిమాండ్‌కు తగినట్టుగానే సరఫరా అవుతుండడంతో ప్రస్తుతానికి ఆందోళన తగ్గిందనే చెప్పాలి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలోని ఆరు ఏజెన్సీల పరిధిలో సుమారుగా 30 వేల వరకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో నెలకు గ్యాస్ అవసరం ఉన్నవారు 50 శాతానికి మించి ఉండరని అంటున్నారు. వంటగ్యాస్ బుకింగ్ సమయాన్ని 45 రోజులకు పెంచడం, వంటగ్యాస్ సరఫరాపై ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, వంటగ్యాస్ సిలిండర్ల కోసం పెద్దగా ఆందోళన చెందనవసరం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.