Share News

లంబసింగిలో డోమ్‌ గ్లాంపింగ్‌ టెంట్లు

ABN , Publish Date - May 16 , 2026 | 10:46 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి హరిత రిసార్ట్స్‌ వద్ద ఏపీటీడీసీ అధికారులు జియోడెసిక్‌ డోమ్‌ గ్లాంపింగ్‌ టెంట్లు శరవేగంగా నిర్మిస్తున్నారు.

లంబసింగిలో డోమ్‌ గ్లాంపింగ్‌ టెంట్లు
లంబసింగిలో ఏపీటీడీసీ నిర్మిస్తున్న జియోడెసిక్‌ డోమ్‌ గ్లాంపింగ్‌ టెంట్లు

రూ.5.33 కోట్లతో శరవేగంగా పనులు

రెండు నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న సరికొత్త వసతి

చింతపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి హరిత రిసార్ట్స్‌ వద్ద ఏపీటీడీసీ అధికారులు జియోడెసిక్‌ డోమ్‌ గ్లాంపింగ్‌ టెంట్లు శరవేగంగా నిర్మిస్తున్నారు. పర్యాటక అభివృద్ధికి పెద్దపీటవేసిన కూటమి ప్రభుత్వం లంబసింగిలో సందర్శకులకు అదనపు సదుపాయాలు కల్పించేందుకు ఈఏడాది జనవరిలో రూ.5.33కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో ఏపీటీడీసీ అధికారులు 15 జియోడెసిక్‌ డోమ్‌ గ్లాంపింగ్‌ టెంట్లు నిర్మాణాలను ప్రారంభించారు. ప్రస్తుతం 75 శాతం నిర్మాణాలు పూర్తి చేశారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేయనున్నారు. జియోడెసిక్‌ డోమ్‌ గ్లాంపింగ్‌ టెంట్లు హరిత రిసార్ట్స్‌ కొండపైన సువిశాలంగా నిర్మిస్తున్నారు. ఒక్కొక్క టెంట్‌ 725 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మిగతా ప్రాంతంలో పిల్లలు ఆడుకునేందుకు ఓపెన్‌ ఏరియా ఉంటుంది. సందర్శకులు విహరించేందుకు ఆరు సీట్లు ఈవీ బుగ్గీలు రెండు అందుబాటులోకి ఉంచుతారు. ప్రతి టెంట్‌లో 7/6 బెడ్‌, రాకింగ్‌ చైర్‌, 3/3 సైడ్‌ టేబుళ్లు, వార్డు రోబ్‌, లగేజ్‌ ర్యాక్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌, నాలుగు కూర్చీలతో కూడిన కాఫీ టేబుల్‌ ఇతర సదుపాయాలు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ జియోడెసిక్‌ డోమ్‌ గ్లాపింగ్‌ టెంట్లు చూసేందుకు గ్లోబ్‌ ఆకారంలో ఉంటాయి. కేరళా తరహాలో ఈ టెంట్లు నిర్మాణం జరుగుతుంది. ఈ టెంట్లలో బస చేస్తే ప్రకృతిని ఒడిలో సరికొత్త అనుభూతి కలుగుతుంది. హరిత రిసార్ట్స్‌లో ఇప్పటికే ఎనిమిది సూట్లు, మూడు డీలక్స్‌, నాలుగు నాన్‌ ఏసీ టెంట్లు, కాన్ఫరెన్సు హాల్‌, రెస్టారెంట్‌ అందుబాటులో ఉన్నాయి. జియోడెసిక్‌ డోమ్‌ గ్లాంపింగ్‌ టెంట్లు అందుబాటులోకి వస్తే దేశ, విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుందని, రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని విశాఖపట్నం ఏపీటీడీసీ డివిజనల్‌ మేనేజర్‌ జీవీబీ జగదీశ్‌ తెలిపారు.

Updated Date - May 16 , 2026 | 10:46 PM