గర్భిణికి తప్పని డోలీమోత
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:45 AM
మండలంలోని గిన్నెలకోట పంచాయతీ బొంగజంగి గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు రెండు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
- రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సిన దుస్థితి
- బొంగజంగి గ్రామానికి రహదారి లేక అవస్థలు
పెదబయలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిన్నెలకోట పంచాయతీ బొంగజంగి గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు రెండు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
బొంగజంగి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పాంగి సునీతకు బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు డోలీ కట్టి మెట్టగూడ వరకు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లారు. అక్కడి నుంచి కొమ్ములకొండ వరకు ఆటోలో తీసుకువెళ్లి అక్కడ అంబులెన్స్ ఎక్కించి ముంచంగిపుట్టు సీహెచ్సీకు తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో వైద్యుల పర్యవేక్షణలో సుఖప్రసవం జరిగింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.