Share News

మన్యం వాసులకు తప్పని డోలీ మోతలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:54 AM

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను వైద్య సేవలు అందించేందుకు రహదారి సౌకర్యం లేక 11 కిలోమీటర్లు డోలీపై గ్రామస్థులు తీసుకెళ్లిన సంఘటన మండలంలోని మర్రిపాకలు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

మన్యం వాసులకు తప్పని డోలీ మోతలు
మహిళను బురదలో డోలీపై మోసుకు వెళుతున్న గ్రామస్థులు

అర్థరాత్రి మహిళకు తీవ్ర అనారోగ్యం

11 కిలోమీటర్లు డోలీపై పలకజీడికి

తీసుకెళ్లిన గ్రామస్థులు

అక్కడి నుంచి వై.రామవరం ఆస్పత్రికి తరలింపు

కొయ్యూరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను వైద్య సేవలు అందించేందుకు రహదారి సౌకర్యం లేక 11 కిలోమీటర్లు డోలీపై గ్రామస్థులు తీసుకెళ్లిన సంఘటన మండలంలోని మర్రిపాకలు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలో అత్యంత మారుమూల పంచాయతీ మర్రిపాకలు గ్రామానికి చెందిన కోరాబు రాంబాబు భార్య పద్మ (26) గత కొన్ని రోజులుగా మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నది. శుక్రవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ఆస్పత్రికి ద్విచక్రవాహనంపై తరలించేందుకు కుటుంబీకులు ప్రయత్నించారు. కానీ రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో తెల్లవారుజామున డోలీ కట్టి 11 కిలోమీటర్లు మోసుకుంటూ పలకజీడికి తరలించారు. అక్కడి నుంచి పోలవరం జిల్లా వై.రామవరం ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ప్రస్తుతం పద్మ అక్కడ వైద్య సేవలు పొందుతున్నది. వర్షాకాలం వచ్చిందంటే.. మర్రిపాకలు పంచాయతీలో ఉన్న 10 గ్రామాలకు రహదారి సౌకర్యం లేక అత్యవసర సమయాలలో డోలీ మోతలు తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు తగిన రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:54 AM