రోగికి తప్పని డోలీమోత
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:14 AM
మండలంలోని బొంగరం పంచాయతీ వంచుర్భ గ్రామం సెంగెరెడ్డ వీధికి రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.
సుమారు రెండు కిలోమీటర్లు మోసుకు వెళ్లాల్సిన దుస్థితి
సెంగెరెడ్డ వీధికి రహదారి లేక అవస్థలు
పెదబయలు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొంగరం పంచాయతీ వంచుర్భ గ్రామం సెంగెరెడ్డ వీధికి రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరినైనా ఆస్పత్రికి తరలించాలంటే డోలీమోతలు తప్పడం లేదు. సెంగెరెడ్డ వీధికి చెందిన పొయిబ రాములమ్మ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అందుబాటులో లేదని చెప్పడంతో జిల్లా ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో లోకల్ అంబులెన్స్ గ్రామం వరకు వెళ్లింది. అయితే సెంగెరెడ్డ వీధికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అక్కడి వరకు వెళ్లలేకపోయింది. దీంతో రాములమ్మను కుటుంబ సభ్యులు డోలీలో సుమారు రెండు కిలోమీటర్లు మోసుకొచ్చి వంచుర్భలో ఉన్న అంబులెన్స్‌లో ఎక్కించారు. అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించారు. తమ ప్రాంతానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు మాధవరావు, సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అయితే రెండు వాగులు దాటి విద్యార్థులు పాఠశాలకు వెళుతున్నారని, అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు.