ఆదివాసీలకు తప్పని డోలి మోతలు
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:31 PM
గిరిజన ప్రాంతంలోని శివారు ఆదివాసీలకు డోలి మోతలు తప్పడం లేదు.
పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఎనిమిది కిలోమీటర్లు తరలింపు
గూడెంకొత్తవీధి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):
గిరిజన ప్రాంతంలోని శివారు ఆదివాసీలకు డోలి మోతలు తప్పడం లేదు. శుక్రవారం పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని కుటుంబ సభ్యులు అతి కష్టంపై వాగులు, వంకలు దాటుకుంటూ ఎనిమిది కిలోమీటర్లు డోలిపై ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. మండలంలోని అమ్మవారి ధారకొండ పంచాయతీ తడకపల్లి గ్రామానికి చెందిన కొర్ర డామిని రెండో కాన్పు నెలలు నిండడంతో శుక్రవారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. తాజాగా కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా పాడైపోయింది. మార్గమధ్యలో ఉన్న వాగు పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాలు గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామం నుంచి శ్యామగెడ్డ వరకు డోలిపై మోసుకొచ్చారు. అక్కడ నుంచి ప్రైవేటు వాహనంలో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో గర్భిణి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.