Share News

గర్భిణికి తప్పని డోలి మోత

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:11 PM

మండలంలోని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో గిరిజనులు నరకయాతన పడుతున్నారు.

గర్భిణికి తప్పని డోలి మోత
గర్భిణి నీలిమని పల్లకిపై మోసుకుంటూ వస్తున్న కుటుంబ సభ్యులు

పల్లకిపై మూడు కిలోమీటర్లు మోసుకొచ్చిన కుటుంబ సభ్యులు

108లో లుంగపర్తికి పీహెచ్‌సీకి తరలింపు

అధిక రక్తస్రావం కావడంతో వైద్యసేవలందించి ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించిన వైద్యులు

మగబిడ్డ జననం..తల్లీబిడ్డ క్షేమం

అనంతగిరి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో గిరిజనులు నరకయాతన పడుతున్నారు. అనంతగిరి పంచాయతీ తలారీపాడు గ్రామానికి చెందిన నీలిమ నిండు గర్భిణి. శుక్రవారం ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో భర్త రాజు కుటుంబ సభ్యుల సాయంతో భార్య నీలిమను పల్లకిపై తలారీపాడు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్లుబందకు మోసుకుంటూ తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆటోలో బొడ్డపాడు వరకు తీసుకువచ్చి, 108లో లుంగపర్తి పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే గర్భిణి నీలిమకు రక్తస్రావం జరుగుతుండడంతో పీహెచ్‌సీ వైద్యాధికారి మంజుభార్గవి వైద్యసేవలను అందించిన అనంతరం అంబులెన్స్‌లో గర్భిణితోపాటు ఇద్దరు ఎంఎల్‌హెచ్‌పీలను తోడుగా ఇచ్చి ఎస్‌కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌.కోట ఏరియా మధ్యాహ్నం నీలిమ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Oct 30 , 2026 | 11:11 PM