Share News

గంజాయి స్మగ్లర్లకు డాగ్‌స్క్వాడ్‌ గుబులు

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:17 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి రవాణాకు అడ్డుకట్టవేసేందుకు సివిల్‌ పోలీసులపైనే ఆధారపడకుండా నార్కోటిక్‌ డాగ్‌స్క్వాడ్‌ సేవలను ఉపయోగిస్తున్నారు.

గంజాయి స్మగ్లర్లకు  డాగ్‌స్క్వాడ్‌ గుబులు

ఇకపై నార్కోటిక్‌ డాగ్‌స్క్వాడ్‌తో నిరంతర తనిఖీలకు సీపీ ఆదేశం

రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు నగర సరిహద్దుల్లో తనిఖీలు

వారంరోజుల్లో మూడుచోట్ల గంజాయి గుర్తించిన డాగ్‌స్క్వాడ్‌

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి రవాణాకు అడ్డుకట్టవేసేందుకు సివిల్‌ పోలీసులపైనే ఆధారపడకుండా నార్కోటిక్‌ డాగ్‌స్క్వాడ్‌ సేవలను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు రైల్వేస్టేషన్‌, ఆర్టీసీకాంప్లెక్‌తోపాటు నగర సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద ప్రతి రోజూ డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. దీంతో గతవారం రోజుల్లో మూడుచోట్ల డాగ్‌స్క్వాడ్‌ గంజాయిని గుర్తించి నిందితులను పోలీసులకు పట్టించాయి. ఈ నేపథ్యంలో గంజాయి స్మగ్లర్లలో గుబులు రేగుతోంది.

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి వినియోగాన్ని నియంత్రించడంపై సీపీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు. దీనికోసం నగరంలోకి గంజాయి సరఫరాను అడ్డుకోకుంటే ఫలితం ఉండదని గుర్తించారు. అందుకోసం నగరంలోని సివిల్‌ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకోవడంతోపాటు సమాచారం అందిన వెంటనే దాడి చేసి గంజాయిని సీజ్‌చేసి, నిందితులపై కేసు నమోదుచేయాలని ఆదేశించారు. పోలీసులంతా గంజాయి రవాణాకు అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నారని సీపీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో గంజాయి, డ్రగ్స్‌ గుర్తించేందుకు నార్కోటిక్‌ డాగ్‌స్క్వాడ్‌ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అయితే కమిషనరేట్‌లో నార్కోటిక్‌ డాగ్‌స్క్వాడ్‌లో కేవలం రెండు డాగ్స్‌ మాత్రమే ఉండడంతో వాటి సేవలను పరిమితంగా వాడుకునే అవకాశం ఉందని అధికారులు సీపీకి వివరించారు. దీంతో నార్కోటిక్‌ డ్రగ్స్‌తోపాటు గంజాయి రవాణాను నగరంలో సమర్థంగా నియంత్రించాలంటే మరిన్ని నార్కోటిక్‌ డాగ్‌స్క్వాడ్స్‌ అవసరమని పేర్కొంటూ ఉన్నతాధికారులకు సీపీ ప్రతిపాదన పంపించారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఇటీవల నగరానికి కొత్తగా ఎనిమిది నార్కోటిక్‌ డాగ్స్‌ను కేటాయించారు. గతంలోని రెండు నార్కోటిక్‌డాగ్స్‌లో ఒకటి విధుల నుంచి విరమించడంతో తొమ్మిది నార్కోటిక్‌డాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. నగరంలోని లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ఒకవైపు గంజాయి స్మగ్లింగ్‌, విక్రయం, వినియోగంపై దాడులు కొనసాగిస్తూనే... మరోవైపు నార్కోటిక్‌ డాగ్స్‌ను కూడా గంజాయి రవాణా అడ్డుకట్టకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

దీంతో ప్రతీరోజూ ఉదయం ఐదు డాగ్‌లు, సాయంత్రం నాలుగు డాగ్‌లు నగరంలో గంజాయి రవాణా, స్మగ్లింగ్‌ జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నాయి. దీంతో వారంరోజుల్లో మూడు చోట్ల గంజాయి ప్యాకెట్లను నార్కోటిక్‌ డాగ్స్‌ గుర్తించడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈనెల 16న విశాఖ రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో గుర్తుతెలియనివ్యక్తి ఒక బ్యాగ్‌ను వదిలిపెట్టగా, నార్కోటిక్‌ డాగ్‌ తనిఖీల్లో ఆరు కిలోల గంజాయి బయటపడింది. పోలీసులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని ఫోర్త్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. ఈనెల 17న కిరండోల్‌ రైలులో ఆరు కిలోల గంజాయి ప్యాకెట్‌లతో కూడిన బ్యాగ్‌ను డాగ్‌స్క్వాడ్‌ గుర్తించి పోలీసులకు అప్పగించింది. ఈనెల 21న జ్ఞానాపురం రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో ఇద్దరు వ్యక్తులు రెండు కిలోల గంజాయి బ్యాగ్‌తో ఉండగా నార్కోటిక్‌ డాగ్‌స్క్వాడ్‌ వారిని పోలీసులకు పట్టించింది.

స్మగ్లర్లలో గుబులు

గతంలో పోలీసులు మాత్రమే గంజాయి తనిఖీలు చేయడంతో వారి కళ్లుగప్పి తప్పించుకునే గంజాయి స్మగ్లర్లకు నార్కోటిక్‌ డాగ్‌స్క్వాడ్‌ రాకతో బెంబేలెత్తుతున్నారు. గంజాయి, సింథటిక్‌ డ్రగ్స్‌ను గుర్తించడంలో ఏడాదిపాటు కఠినమైన శిక్ష ణ, తర్ఫీదు పొందిన నార్కోటిక్‌ డాగ్స్‌ ఇటీవలే పోలీస్‌విధుల్లో చేరడంతో అవన్నీ చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎక్కడో ఉన్న గంజాయిని కూడా వాసనతో పసిగట్టి పోలీసులకు అప్పగిస్తున్నాయి. దీంతో గంజాయి స్మగ్లర్లకు డాగ్‌స్క్వాడ్‌నుంచి తప్పించుకోవడం కష్టతరంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ప్రతి రోజూ రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్‌స్టాండ్‌లు, కాంప్లెక్స్‌లు, బీచ్‌రోడ్డుతోపాటు నగరంలోని కొరియర్‌ సర్వీసు పాయింట్‌లు, పార్సిల్‌ పాయింట్లలో డాగ్‌స్క్వాడ్‌తో ప్రతి రోజూ తనిఖీలు చేస్తుండడంతో గంజాయి స్మగ్లర్లకు ముకుతాడు పడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 01:17 AM