Share News

వైద్యుల కక్కుర్తి!

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:55 AM

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేష్‌ తీవ్రమైన నడుము, వెన్నునొప్పితో కలెక్టరేట్‌ సమీపంలోని ఓ వైద్యుడి వద్దకు వెళ్లారు.

వైద్యుల కక్కుర్తి!

  • కమీషన్‌ కోసం డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ల నిర్వాహకులతో కొందరు డాక్టర్ల లాలూచీ

  • పరీక్షను బట్టి 20 నుంచి 40 శాతం వరకూ పర్సంటేజీ

  • అదనపు సంపాదనకు అడ్డదారులు

  • తాము చెప్పినచోటే పరీక్షలు చేయించుకోవాలని రోగులకు సూచన

  • లేదంటే చుక్కలు చూపిస్తున్న వైనం

  • నైతిక నిబంధనలకు విరుద్ధం

  • ఫిర్యాదు చేస్తే విచారిస్తాం: వైద్య ఆరోగ్య శాఖ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేష్‌ తీవ్రమైన నడుము, వెన్నునొప్పితో కలెక్టరేట్‌ సమీపంలోని ఓ వైద్యుడి వద్దకు వెళ్లారు. వైద్యుడు సుమారు ఆరు రకాల పరీక్షలను రాశారు. ఆయన సూచించిన డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వెళితే ఆ పరీక్షలకు సుమారు రూ.8 వేలు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. మరో సెంటర్‌లో ఆరా తీయగా వారు రూ.5 వేలకు చేస్తామన్నారు. ఈ విషయాన్ని ముందుగా వెళ్లిన డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ నిర్వాహకులు వైద్యుడికి తెలియజేయడంతో వెంటనే వైద్యుడి సహాయకుడు రోగికి ఫోన్‌ చేశారు. డాక్టర్‌ చెప్పిన చోటే పరీక్షలు చేయించాలని, లేదంటే సమస్య అవుతుందని చెప్పడంతో అధిక మొత్తం చెల్లించి అక్కడే పరీక్షలు చేయించుకున్నారు.

జిల్లా పరిషత్‌ జంక్షన్‌ సమీపంలోని మరో వైద్యుడు కూడా ఓ రోగికి రూ.6 వేలు ఖర్చయ్యే పరీక్షలు రాశారు. మరో ల్యాబ్‌లో ఇవే పరీక్షలను రూ.4,200కే చేయించుకోగా, ఆ వైద్యుడి సహాయకుడు రోగితో అభ్యంతరకరమైన భాషలో మాట్లాడి ఇబ్బందులకు గురిచేశారు.

నగరంలోని కొందరు వైద్యులు కమీషన్లకు కక్కుర్తి పడుతూ ల్యాబ్‌ నిర్వాహకులతో కుమ్మక్కవుతున్నారు. ఫలితంగా రోగుల జేబులకు చిల్లుపడుతోంది. ఆస్పత్రి/క్లినిక్‌కు వచ్చేవారి సమస్యను బట్టి పరీక్షలు సూచిస్తున్న చేస్తున్న వైద్యులు...తాము సూచించిన ల్యాబ్‌లోనే చేయించుకోవాలని మెలికపెడుతున్నారు. వేరేచోట చేయిస్తే ఆ రిపోర్టులను చూసేందుకు కూడా ఇష్టపడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యపరమైన నైతిక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సమంజసం కాదని సీనియర్‌ వైద్యులు పేర్కొంటున్నారు.

కలెక్టరేట్‌ సమీపంలోని పలువురు వైద్యులు తమ క్లినిక్‌కు వచ్చే రోగులపై తాము చెప్పిన చోటే పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆయా డయాగ్నోస్టిక్‌ సెంటర్ల నుంచి భారీమొత్తంలో కమీషన్‌లు అందడమే దీనికి కారణమంటున్నారు. ప్రిస్కైబ్‌ చేసే పరీక్షల్లో 20 నుంచి 40 శాతం వైద్యుడికి సదరు డయాగ్నోస్టిక్‌ సెంటర్లు చెల్లిస్తుంటాయి. దీనికి అదనంగా ఏటా విదేశీ టూర్లు, ఇతర ప్యాకేజీలు ఉంటాయి.

నిబంధనలివీ...

వైద్యుడు పరీక్షలను సిఫారసు చేయడానికి, మందులను ప్రిస్కైబ్‌ చేయడానికి మాత్రమే పరిమితం కావాలి. రోగి తనకు నచ్చిన చోట పరీక్షలు చేయించుకునే, మందులు తీసుకునే హక్కు ఉంది. దానికి భిన్నంగా ఎంతోమంది వైద్యులు బలవంతంగా తాము సూచించిన చోటే పరీక్షలు చేయించుకోవాలని, మందులు కొనాలని నిబంధనలు పెడుతుండడంతో రోగి ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా...రోగిని ఫలానా చోట మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని చెప్పే అధికారం వైద్యులకు లేదని, అలా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యులు నైతికతతో విధులు నిర్వర్తించాలని, ఈ తరహా చర్యలతో మొత్తం వైద్య వ్యవస్థపై దురభిప్రాయం ఏర్పడుతుందన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:55 AM