లంచం తీసుకున్నారనే ఆరోపణపై వైద్యురాలు శోభాదేవిపై విచారణ
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:18 PM
రోగికి చికిత్స అందించేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై స్థానిక ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ చావల శోభాదేవిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జి.వీరపాండియన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
లంచం తీసుకున్నారనే ఆరోపణపై వైద్యురాలు శోభాదేవిపై విచారణ
అనకాపల్లి జిల్లాలో పనిచేసిన సమయంలో ఫిర్యాదు
డాక్టర్ వివరణను తిరస్కరించిన ప్రభుత్వం
విచారణాధికారిగా శ్రీకాకుళం డీసీహెచ్‌ఎస్ నియామకం
చింతపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రోగికి చికిత్స అందించేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై స్థానిక ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ చావల శోభాదేవిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జి.వీరపాండియన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సివిల్ సర్జన్ స్పెషలిస్టు శోభాదేవి అనకాపల్లి జిల్లాలో పనిచేసిన కాలంలో బాధితులైన రోగి నుంచి అక్రమ పారితోషికంగా కొంత నగదు తీసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై 1991 రూల్ 20 ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఈ ఆరోపణలపై డాక్టర్ శోభాదేవి ఇచ్చిన లిఖితపూర్వక వివరణను పరిశీలించిన ప్రభుత్వం సంతృప్తికరంగా లేదని తిరస్కరించింది. ఈమేరకు సమగ్ర విచారణ చేపట్టేందుకు ఏపీసీఎస్(సీసీఏ) రూల్స్, 1991 రూల్ 20(2) ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్) కేఎన్ విజయలక్ష్మిని విచారణ అధికారిగా నియమించారు. అలాగే ప్రజెంటింగ్ అధికారిగా పార్వతీపురం జిల్లా ఆస్పత్రి గైనికాలజిస్టు డాక్టర్ వై. నాగ శివజ్యోతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విచారణకు అవసరమైన రికార్డులు, సమాచారాన్ని తాడేపల్లి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విచారణ అధికారికి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.