వంట గ్యాస్‌పై ఆందోళన వద్దు
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:00 AM
వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి అన్నారు.
వచ్చే నెలాఖరు వరకూ సరిపడేలా నిల్వలు
ఎప్పటికప్పుడు చమురు సంస్థల ప్రతినిధులతో సమీక్షిస్తున్నాం
జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి
విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):
వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ వినియోగదారులు, ఇతర సంస్థల అవసరాలకు సంబంధించి వచ్చే నెలాఖరు వరకూ సరిపోయేంత నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. యుద్ధం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. అవసరం లేకున్నా కొంతమంది సిలిండర్లు బుక్ చేసుకుంటుండడంతో అవసరం ఉన్న వారికి సరఫరాలో జాప్యం జరుగుతుందన్నారు. జిల్లాలో 62 ఏజెన్సీలకు రోజుకు 22 వేల నుంచి 24 వేల సిలిండర్లు సరఫరా చేసే సామర్థ్యం ఉందని, కానీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలతో రోజుకు 50 వేలకుపైగా బుకింగ్స్ వస్తున్నాయన్నారు. గడచిన వారం రోజులుగా రోజువారీ సిలిండర్ల సరఫరా కంటే బుక్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో డెలివరీలో కొంత జాప్యం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వాణిజ్య అవసరాల్లో 20 శాతం వరకు మాత్రమే సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పరిధిలో 450 వరకు విద్యా సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖలో 80 సంస్థలు ఉన్నాయని పేర్కొంటూ వాటి అవసరాలకు తగిన విధంగా సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. ఫార్మా పరిశ్రమలు, రైల్వే పరిధితో క్యాంటీన్లకు సిలిండర్లు కావాలని ఆయా సంస్థల ప్రతినిధులు కోరుతున్నారని, అక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహించేందుకు క్యాంటీన్లు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతా క్రమంలో ఆయా సంస్థలకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని ఆమె చెప్పారు. నగరంలో గ్యాస్ సిలిండర్లను ఎవరైనా పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. దీనికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీలతో నిరంతరం సమీక్షిస్తున్నామని విద్యాధరి వెల్లడించారు. వంట గ్యాస్ సరఫరాపై ప్రతిరోజు సాయంత్రం సంబంధిత చమురు సంస్థలు, అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు.
డీఆర్వోగా విశ్వేశ్వరనాయుడు
ఉమ్మడి జిల్లాలో డీటీ, తహశీల్దార్, కలెక్టరేట్ పాలనాధికారిగా
బాధ్యతల నిర్వహణ
విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):
జిల్లా రెవెన్యూ అధికారిగా కడప డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు నియమితులయ్యారు. సుమారు ఐదు నెలల నుంచి విశాఖ డీఆర్వో పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ డీఆర్వోగా ఉన్న బీహెచ్ భవానీశంకర్‌ను పలు కారణాలతో గత ఏడాది అక్టోబరు 20న ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి ఇన్‌చార్జి అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీఆర్వోగా కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ శేషశైలజ వ్యవహరిస్తున్నారు.
కాగా డీఆర్వోగా నియమితులైన విశ్వేశ్వరనాయుడు 1995లో గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహశీల్దారుకు ఎంపికయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గాజువాక, పెదగంట్యాడ మండలాల్లో డీటీగా, పదోన్నతిపై పరవాడ ఎమ్మార్వోగా పనిచేశారు. ఆ తరువాత కలెక్టరేట్ పాలనాధికారిగా ఉండగా డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి వచ్చింది. పలు జిల్లాల్లో ఎస్డీసీగా సేవలు అందించిన విశ్వేశ్వరనాయుడుకు విశాఖ జిల్లాపై పూర్తి అవగాహన ఉంది. ఆయన ఉగాది తరువాత బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కాగా విశాఖలో హెచ్‌పీసీఎల్ ఎస్డీసీగా పనిచేస్తూ ప్రస్తుతం విశాఖ ఆర్డీవోగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న సనపల సుధాసాగర్ విజయనగరం ఆర్డీవోగా నియమితులయ్యారు. ఖాళీగా ఉన్న సింహాచలం దేవస్థానం భూపరిరక్షణ ఎస్డీసీ పోస్టులో కె.మధులతను నియమించారు.
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుపై వడ్డీ రాయితీ
50 శాతం మేర ప్రకటించిన ప్రభుత్వం
పన్ను వసూళ్లు పెరుగుతాయని
జీవీఎంసీ అధికారుల ఆశాభావం
విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):
ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను, ఖాళీస్థలాల పన్ను బకాయిలు ఒకేసారి చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్టు జీవీఎంసీ అధికారులు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీవీఎంసీకి రూ.500 కోట్లు పన్ను వసూలు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.500 కోట్లకుపైగా వసూలైంది. నెలాఖరు నాటికి మరో రూ.80 కోట్లు వసూలవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ రాయితీ ప్రకటించడంతో మరో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు వరకు అదనంగా వసూలవుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తుందన్నారు. ఆర్థిక సంవత్సరం చివరికి చేరుకోవడం పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఇకపై సెలవు దినాల్లో కూడా ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాల్లో పన్ను వసూలు కౌంటర్లు తెరిచి ఉంచుతామని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. ఇవికాకుండా సిరిపురం ఐడీబీఐ, ద్వారకానగర్ ఐసీఐసీఐ, మధురవాడ పంజాబ్ నేషనల్‌బ్యాంకు, రామ్‌నగర్ యాక్సిస్ బ్యాంకుల్లో ప్రజలు పన్నులు చెల్లించవచ్చునన్నారు. ఒకవేళ ఇంటి నుంచి బయటకు వెళ్లలేనివారుంటే అలాంటి వారికోసం వార్డు సచివాలయం అడ్మిన్ కార్యదర్శులే వస్తారని, యూపీఐ ద్వారా పన్ను చెల్లించవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.