మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు
ABN , Publish Date - May 01 , 2026 | 02:20 AM
డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వినియోగానికి, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
యువతకు, విద్యార్థులకు కలెక్టర్ పిలుపు
డ్రగ్స్‌రహిత జిల్లాగా మార్చడానికి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వినియోగానికి, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు, నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ (ఎస్‌సీఓఆర్‌డీ) అవగాహన కార్యక్రమాలకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని గురువారం ఎస్పీ తుహిన్‌సిన్హాతో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. డ్రగ్స్, గంజాయిని అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అనకాపల్లిని డ్రగ్స్‌రహిత జిల్లాగా మార్చాలని ఆదేశించారు. గంజాయి మహమ్మారి చాలా సమస్యలకు కారణమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల అలవాటు నుంచి బయట పడేందుకు డీ-అడిక్షన్ సెంటర్ల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అరికట్టాలని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యా సంస్థ పరిసరాలల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో నిరంతరం గస్తీ నిర్వహించాలని పోలీసు, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్, గంజాయిపై అవగాహన కల్పించే పోస్టర్‌లను బస్సులపై అతికించి ప్రజలకు అవగాహన కలిగేలా చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి రవాణా నిరోధానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, జిల్లా రవాణా, ప్రజా రవాణా, వ్యవసాయ, విద్య, అటవీ, ఎక్సైజ్, వెనుకబడిన, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖలు, ఇంటిలిజెన్స్, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్, వైద్య ఆరోగ్య శాఖ, డ్రగ్ కంట్రోలర్, జీఆర్‌పీ, ఆర్పీఎఫ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పట్టణవాసులకు విరివిగా ఇళ్లు
సొంత స్థలం ఉంటే చాలు పీఎంఏవై 2.0 అర్బన్ కింద కేటాయింపు
ఒక్కో ఇంటికి రూ.2.5 లక్షల చొప్పున మంజూరు
సచివాలయాల్లో నిరంతరం దరఖాస్తుల స్వీకరణ
నర్సీపట్నం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద అర్బన్ హౌసింగ్ పథకంలో 312 ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే లబ్ధిదారులకు పీఎంఏవై అర్బన్ హౌసింగ్ పథకం కింద కూటమి ప్రభుత్వం రూ.2.5 లక్షలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా దరఖాస్తులు తీసుకోవాని సచివాలయ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి కాల పరిమితి లేదు. మూడు నెలలకు ఒకసారి గృహనిర్మాణ సంస్థ అధికారుల నుంచి ప్రతిపాదనలు (దరఖాస్తులు) తెప్పించుకొని ఇళ్లు, నిధులు మంజూరు చేస్తుంది. పీఎంఏవై 2.0లో నర్సీపట్నం మునిసిపాలిటికి 66 ఇళ్లు మంజూరు కాగా 38 పురోగతిలో ఉన్నాయి. ఎలమంచిలి పురపాలక సంఘంలో 85 ఇళ్లకుగాను 52 ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. అనకాపల్లి అర్బన్ ప్రాంతంలో 84 ఇళ్లకుగాను 53 ఇళ్ల పనులు మొదలయ్యాయి. అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 235 ఇళ్లు మంజూరు చేయగా 143 మంది నిర్మాణాలు మొదలు పెట్టారు. కాగా ఇటీవల మరి కొంతమంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు వీటిని పరిశీలించి 312 ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపారు. నర్సీపట్నంలో 82, ఎలమంచిలిలో 172, అనకాపల్లి 58 ఇళ్లు ఉన్నాయి.
సొంత స్థలం ఉంటే ఇల్లు మంజూరు
ఎన్.శ్రీనివాసరావు, ఈఈ, గృహనిర్మాణ సంస్థ, నర్సీపట్నం
ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద అర్బన్ హౌసింగ్ పథకం కింద ఇల్లు కావాల్సిన వారు సొంత స్థలం వుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు కాల పరమితి లేదు. సచివాయాలనికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.2.5 లక్షల చొప్పున మంజూరు చేస్తుంది.