Share News

ఆర్‌ఎస్‌కేలపై అపోహలు వద్దు

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:49 AM

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేస్తున్న రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే)పై అపోహలు పెంచుకోవద్దని, వాటి వల్ల ఎటువంటి నష్టం ఉండదని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కె.మన్మథరావు స్పష్టంచేశారు.

ఆర్‌ఎస్‌కేలపై అపోహలు వద్దు

డాక్యుమెంట్లకు పూర్తి భద్రత

జిల్లాకు ఒకటి మాత్రమే ఏర్పాటు

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ర్టేషన్లు

డీఐజీ కె.మన్మథరావు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేస్తున్న రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే)పై అపోహలు పెంచుకోవద్దని, వాటి వల్ల ఎటువంటి నష్టం ఉండదని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కె.మన్మథరావు స్పష్టంచేశారు. ఆయన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల మాదిరిగానే ఆర్‌ఎస్‌కేలు కూడా పనిచేస్తాయన్నారు. ఇవి జిల్లాకు ఒకటి చొప్పున మాత్రమే ఉంటాయని, ఎప్పటిలాగే జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ పనిచేస్తాయన్నారు. ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు చేసుకోవచ్చునన్నారు.

ఆర్‌ఎస్‌కేలో ఏమి చేస్తారంటే...?

ఆర్‌ఎస్‌కే నిర్వహణ బాధ్యతను మాత్రమే ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీకి ఇస్తోంది. అందులో సాఫ్ట్‌వేర్‌, డేటా అంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. డాక్యుమెంట్‌ తయారు చేసుకున్నాక ఆర్‌ఎస్‌కేకి వెళితే దానికి అవసరమైన పత్రాలు ఉన్నాయా? లేదా? అని పరిశీలించి చెక్‌ స్లిప్‌, ఫొటోల స్కానింగ్‌, స్టాంపు డ్యూటీ చెల్లింపు వ్యవహారాలన్నీ అక్కడ పూర్తిచేస్తారు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్‌ సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళుతుంది. అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ అన్నీ పరిశీలించి, ఈకేవైసీ చేస్తారు. స్కానింగ్‌ చేస్తారు. డాక్యుమెంట్‌ రిజిస్టర్‌ చేస్తారు. కక్షిదారులకు అందజేస్తారు. బ్యాక్‌ ఎండ్‌ ప్రాసెస్‌ అంతా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే జరుగుతుంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లాగే ఆర్‌ఎస్‌కేల్లో కూడా కక్షిదారులకు టైమ్‌ స్లాట్‌ ఇచ్చి, ఆ సమయానికి అక్కడికి అన్ని పత్రాలతో వెళితే...సులువుగా పనిచేసి పంపడానికి మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు డీఐజీ వివరించారు. ఇది రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటీకరణ చేయడం కాదని పేర్కొన్నారు.

వారి ఉపాధికి ఇబ్బంది ఉండదు

ఆర్‌కేసీలు వస్తే తమ ఉపాధి పోతుందని డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన చేస్తున్నారని, అది కూడా అపోహే అని డీఐజీ స్పష్టంచేశారు. వాస్తవానికి 2004-05 ఆర్థిక సంవత్సరం నుంచే డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను ప్రభుత్వం తొలగించిందన్నారు. అయినా వారు ఇంకా కొనసాగుతున్నారని, ఆర్‌ఎస్‌కేలు వచ్చినా, డాక్యుమెంట్లను రైటర్లే తయారుచేస్తారు కాబట్టి వారి ఉపాధికి ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. ఎవరైనా తమకు తామే డాక్యుమెంట్‌ తయారు చేసుకుంటామంటే ప్రతి కార్యాలయంలో ‘మే ఐ హెల్ప్‌ యు’ డెస్క్‌ ఉంటుందని, అక్కడ పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానంలో ఏ డాక్యుమెంట్‌ అయినా తయారుచేసుకోవచ్చునని, అక్కడి సిబ్బంది సహకరిస్తారన్నారు. డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళనలు ఆపేసి, యథాప్రకారం అవసరమైన వారికి సేవలు అందించాలని సూచించారు.

Updated Date - Jul 22 , 2026 | 12:49 AM