లక్ష్యాల కోసం ఒత్తిడి తేవొద్దు
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:08 AM
భద్రతను పెంచాలని, తగినంత మంది సిబ్బందిని నియమించాలని, ఉత్పత్తి లక్ష్యాల కోసం ఒత్తిడి తేవొద్దని స్టీల్‌ప్లాంటు అధికారులకు ఎస్‌ఎంఎస్ విభాగం ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్స్ డైరెక్టర్ సుభాషిస్‌సేన్ గుప్తా, ఇన్‌చార్జి పర్సనల్ డైరెక్టర్ ఏకే బాగ్చీలు బుధవారం ఉద్యోగులు, కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వివరించారు.
భద్రతా ప్రమాణాలు పాటించండి
తగినంత మంది సిబ్బందిని నియమించండి
ఉక్కు డైరెక్టర్‌లకు ఎస్‌ఎంఎస్ విభాగం ఉద్యోగులు, కార్మికుల విజ్ఞప్తి
మృతుల కుటుంబాలకు
కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్
భవిష్యత్తులో ప్రమాదాలు చోటుచేసుకోకుండా
తగిన ప్రణాళికతో ముందుకు వెళతామన్న అధికారులు
గాజువాక, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):
భద్రతను పెంచాలని, తగినంత మంది సిబ్బందిని నియమించాలని, ఉత్పత్తి లక్ష్యాల కోసం ఒత్తిడి తేవొద్దని స్టీల్‌ప్లాంటు అధికారులకు ఎస్‌ఎంఎస్ విభాగం ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్స్ డైరెక్టర్ సుభాషిస్‌సేన్ గుప్తా, ఇన్‌చార్జి పర్సనల్ డైరెక్టర్ ఏకే బాగ్చీలు బుధవారం ఉద్యోగులు, కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వివరించారు. విభాగంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలుమార్లు చెప్పామని, అయినా నిర్లక్ష్యం చేశారని, అందుకే ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నిజానిజాలను కార్మిక వర్గానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టాండర్డ్ ఆపరేషన్ పొజిషన్, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అందుకు అధికారులు సమాధానమిస్తూ భద్రతను మరింత పెంచుతామన్నారు. తగినంత సిబ్బందిని ఏర్పాటు చేస్తామని, ఉత్పత్తి లక్ష్యాలపై ఒత్తిడి అనే మాటే ఉండదని ఉద్యోగులకు వివరించారు. నష్ట పరిహారం విషయం కేంద్రం దృష్టికి తీసుకువెళతామన్నారు. మృతుల కుటుంబాలకు ప్లాంటు యాజమాన్యం అండగా ఉంటుందని, మనోధైర్యంతో విధులు నిర్వహించాలని, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళతామని అధికారులు తెలిపారు. సమావేశంలో ప్లాంటు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.